AP Odisha War: ఏపీ, ఒడిశాల మధ్య ఓ గ్రామం.. గ్రామంలోని ప్రతీ ఒక్కరికీ రెండు ఓట్లు.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఓ వివాదం దశాబ్ధాలుగా తేలడం లేదు. ఒకప్పుడంటే ఓకే అనుకోవచ్చు.. ఇంతగా సాంకేతిక పరిఙ్ఞానం పెరిగిపోయిన రోజుల్లో కూడా ఓ చిన్న వివాదం తెగకపోవడం ఒకింత..

  • Rajesh Sharma
  • Publish Date - 5:06 pm, Thu, 8 April 21
AP Odisha War: ఏపీ, ఒడిశాల మధ్య ఓ గ్రామం.. గ్రామంలోని ప్రతీ ఒక్కరికీ రెండు ఓట్లు.. ఎందుకంటే?
Katia

AP Odisha war for a village: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఓ వివాదం దశాబ్ధాలుగా తేలడం లేదు. ఒకప్పుడంటే ఓకే అనుకోవచ్చు.. ఇంతగా సాంకేతిక పరిఙ్ఞానం పెరిగిపోయిన రోజుల్లో కూడా ఓ చిన్న వివాదం తెగకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఓ గ్రామాన్ని తమదంటే తమదని రెండు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. ఫలితంగా రెండు ప్రభుత్వాలు అక్కడ తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య ఉంది కొటియా గ్రామం. అక్కడి ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి ఏపీలోను, మరొకటి ఒడిశాలోను వేస్తారు. అలానే రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అంతే. అటు ఇటు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ గ్రామాలపై రగడ రేగుతోంది.

ఏపీలోని విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది వివాదాస్పద కొటియా గ్రామం. పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు వచ్చే వారిని ఒరిశా పోలీసులు ఆపడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. కొటియాలో ఉండే తోనామ్‌, మోనంగి పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు రాకుండా ఒరిశాకు చెందిన పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు పెట్టి మరీ వారిని ఆపుతున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడే కాదు నేరేళ్ల వలస, సారిక దగ్గర స్థానికులు ఓటు వేయకుండా ఆపారు పోలీసులు. ఎవరు ఆపినా తాము ఓటు హక్కు వినియోగించుకొని తీరుతామంటున్నారు ఓటర్లు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గంజాయిభద్రలో 1,290 ఓట్లున్నాయి.

విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొటియా గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ జిల్లా ఎస్పీ రాజకుమారి కూడా ఒరిస్సా అధికారులతో మాట్లాడటం హాట్ టాపికైంది. పోలింగ్‌కు సహకరించాలని వారిని కోరినా స్పందించలేదు ఒడిశా అధికారులు. ఫలితంగా అసలు ఆ గ్రామాల్లో ఓటింగ్ విషయంలో ఎందుకు గొడవ వచ్చింది ఏంటనేది ఇపుడు చర్చనీయాంశమైంది.

సమస్యగా మారిన ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కోటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు ఆంధ్ర అధికారులు ఏర్పాట్లు చేశారు. తీరా గురువారం పోలింగ్ ప్రారంభానికి ముందు ఓటర్లను రాకుండా ఒడిశా అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కొటియా గ్రామాలపై వివాదం ఆంధ్రా, ఒడిశా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ గ్రామాలు మావంటే మావంటూ రెండు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. ఏపీ పరిషత్‌ ఎన్నికలను అడ్డుకోడానికి ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. ఇలా ఏపీ స్థానిక సంస్థల్లో కొటియా గ్రామాల ప్రజలు ఓట్లు వేయకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి. ఇన్నేళ్ళుగా వివాదం కొనసాగుతున్నా ఇలాంటి చర్యలను గతంలో రెండు ప్రభుత్వాలు చేయలేదు.

ఓటర్లను నియంత్రించడంలో భాగంగా కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అక్తర్‌ ఆదేశాల మేరకు 22 కోటియా గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. గంజాయిభద్ర పరిధిలోని నేరెళ్లవలసలో గ్రామస్థులను బయటకు రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఎగువ, దిగువ గంజాయిభద్ర, కొటియా, దూళిభద్ర ఎగువ, దిగువ శెంబి తదితర గ్రామస్థులను ఓటింగ్‌కు హాజరు కావద్దొంటూ ఒడిశా అధికారులు హెచ్చరించారు. హెచ్చరికలతో సరిపెట్టకుండా కోటియా గ్రామాల సరిహద్దులను కూడా అక్కడి అధికారులు మూసి వేశారు. నేరెళ్లవలసలో గంజాయిభద్ర పంచాయతీలో 1,291 మంది ఓటర్లుండగా వారిలో 628 మంది పురుషులు, 663 మంది మహిళలున్నారు. వివాదాస్పద గ్రామాల్లో ఎన్నికలను ఇరు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి పోలింగ్‌ నిర్వహణకు వెళ్లిన ఏపీ సిబ్బందిని కూడా అడ్డుకున్నా ఒడిశా పోలీసులు. దీంతో ఐటీడీఏ పీవో, స్థానిక ఏపీ అధికారులు ఒడిశా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపారు. అయితే ఈ 21 గ్రామాల వివాదం దశాబ్ధాలుగా కొనసాగుతున్నందున ఈ చర్చలు ఏ మాత్రం ఫలించలేదు.

రెండు రాష్ట్రాల సరిహద్దులోని 21 గ్రామాలు మావంటే మావంటూ ఇరు రాష్ట్రాల అధికారులు సాక్ష్యాలు చూపుతున్నారు. తమకు చెందిన గ్రామాలలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో రాష్ట్రాల మధ్య సర్వేకు కూడా ఈ కొటియా గ్రామాలు నోచుకోలేదు. ఆసర్వే జరిగి వుంటే ఆ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేలిపోయేది. దాంతో ఆ గ్రామాలపై హక్కులు ఏ రాష్ట్రానివో ఇప్పటికీ పంచాయతీ తేలడం లేదు. కొటియా గ్రామాలు తమవంటే తమవని దశాబ్ధాల కిందే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే ఈ విషయాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలకు సూచించింది.

ఈ కొటియా గ్రామాలు ఎవరివన్నది తేలకపోవడంతో చాలా కాలంపాటు ఒడిశా ప్రభుత్వం ఈ గ్రామాలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ గ్రామాల ప్రజలకు సంక్షేమ పథకాలను చాలా కాలం పాటు అందించలేదు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్ట లేదు. కానీ గత పదేళ్ళుగా ఒడిశా ప్రభుత్వ ధోరణి మారిపోయింది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ చర్యలను ప్రారంభించింది ఒడిశా ప్రభుత్వం. రెండు, మూడేళ్ళుగా ఈ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం శాశ్వత భవానాల నిర్మాణాన్ని కూడా అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. అనేక చోట్ల ఏపీకి చెందిన తెలుగు బోర్డులను ఒడిశా అధికారులు, పోలీసులు తొలగించడం కూడా ప్రారంభించారు. దానికి తోడుగా 2021 ఫిబ్రవరి 10న ఏపీ ప్రభుత్వం ధోరణిపై ఒడిశా సర్కార్ మండిపడింది. తమకు చెందిన గ్రామాలలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ నవీన్ పట్నాయక్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లపై ఒడిశా పిటిషన్ ఫైల్ చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలనడం, పార్లమెంటులో ఈ వివాద పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కారణాలుగా చూపిస్తూ.. వివాదాస్పద గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందంటూ ఒడిశా తమ పిటిషన్‌లో పేర్కొన్నది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.

కొటియా గ్రామాలపై మొట్టమొదట 1968లో వివాదం మొదలైంది. తమకు చెందిన ఈ గ్రామాల్లో ఏపీ అక్రమంగా చొరబడుతుందంటూ సుప్రీంకోర్టును తొలిసారిగా 1968లో ఒడిశా ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. యథాతథ స్ధితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలంపాటు విచారణ కొనసాగిన తర్వాత 2006లో ఒడిశా పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. తాజాగా కొటియా గ్రామాల పేర్లను మార్చడం ద్వారా ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఒడిశా కొత్త వాదనను తెరమీదికి తెస్తోంది. పేర్లు మార్చిన గ్రామాల జాబితాను సుప్రీంకోర్టుకు అందజేశారు ఒడిశా అధికారులు. గంజాయ్‌ పదర్ గ్రామం పేరును గంజాయ్‌ భద్రగాను, ఫట్టు సెనరీ గ్రామాన్ని పట్టు చెన్నూరుగాను, ఫగు సెనరీ పేరును పగులు చెన్నూరుగాను పేర్లు మార్చారని ఒడిశా చెబుతోంది. ఇవే గ్రామాల్లో తాము గతంలో ఎన్నికలు నిర్వహించామంటూ ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించారు.

ఈ వివాదం పరిష్కారానికి రాష్ట్రాల ఏర్పాటు నాటి ఉత్తర్వులను, ప్రభుత్వ గెజిట్లను పరిశీలించడం, ఆధునిక సర్వే ఎక్విప్‌మెంట్లను ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దులను తేల్చడం వల్ల ఈ కొటియా గ్రామాల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకునే వీలుంది. కానీ ఇందులో రెండు రాష్ట్రాలు కాకుండా.. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితేనే శాశ్వత పరిష్కారానికి దారి పడుతుందని పరిశీలకులంటున్నారు. కేంద్ర చొరవ చూపేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు యత్నిస్తే ఫలితముండే ఛాన్స్ కనిపిస్తోంది.

ALSO READ: రెండో దశలో రెచ్చిపోతున్న కరోనా.. ఓవైపు వైరస్.. ఇంకోవైపు వ్యాక్సిన్ కొరత