
ఏపీ, తెలంగాణ, కర్నాటక.. మూడు రాష్ట్రాలకు ప్రధాన జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు.. ఇప్పుడు కొత్తగేట్లతో కళకళలాడిపోతోంది. 51 కోట్లు పోసి 33 గేట్లు మార్చి, నీటి విడుదలకు మేం రెడీ అంటున్నాయి ప్రభుత్వాలు. ముగ్గురు ముఖ్యమంత్రులూ ఒకే కారులో వచ్చి, చెయ్యెత్తి జైకొట్టారు. కానీ, అక్కడ జలకళ మాత్రం శూన్యావస్థలోనే ఉంది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాభావం వెక్కిరిస్తూనే ఉంది. వస్తూవస్తూ ఒక్క వానచినుకును పట్టుకురమ్మని తెలుగు ముఖ్యమంత్రుల్ని వేడుకుంటోంది ఇక్కడి రైతాంగం. లక్షల ఎకరాల ఆయకట్టును తడిపి, వేలాది గ్రామాలకు దాహం తీర్చే తుంగభద్ర ఒక్కటే కాదు.. తెలంగాణలోని రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజ్‌కి పడిపోయి, ఈసారి కరువు గ్యారంటీ అని భారమైన సంకేతాలిస్తున్నాయి. జూన్ ముగుస్తున్నా వర్షాలు కురవకపోవడం.. డెడ్‌స్టోరేజ్‌కి చేరుకున్న జలాశయాలు… అడుగంటుతున్న భూగర్భ జలాలు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్ని కరుపు భయం వెంటాడుతోంది. సాగు నీటికీ, తాగునీటికీ ఇక్కట్లు తప్పేలా లేవు. ముందు మురిపించిన వర్షాలతో విత్తునాటిన రైతులు, మొలకెత్తిన పంటలను కాపాడుకునేందుకు నానా యాతనా పడుతున్నారు. గత ఏడాది జూన్ ఆఖరునాటికి నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు కనీస నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా గోదారి తీర ప్రాంతం కరువు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. వానాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా వరద...