
సొంతూళ్లకు వెళ్లినప్పుడు చాలా మంది ఇంట్లో తయారుచేసిన నెయ్యి, నూనె లేదా పచ్చళ్లను తిరుగు ప్రయాణంలో వెంట తెచ్చుకుంటారు. అయితే, భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రైలు ప్రయాణంలో ద్రవరూపంలో ఉండే నెయ్యి లేదా నూనెను తీసుకెళ్లడంపై కొన్ని కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. రైలు ప్రయాణంలో నెయ్యి (Ghee) లేదా నూనె వంటి పదార్థాలను తీసుకెళ్లడానికి సంబంధించిన భారతీయ రైల్వే నిబంధనల గురించి ప్రతి ఒక్కరికీ తప్పక తెలిసి ఉండాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..
రైల్వే చట్టం ప్రకారం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రమాదకరమైన, పేలుడు సంభవించే లేదా త్వరగా మంటలు అంటుకునే ఏ వస్తువునైనా రైలులో తీసుకెళ్లడం నేరం. నెయ్యి, వంట నూనెలు ద్రవరూపంలో ఉండి, అధిక ఉష్ణోగ్రత వద్ద త్వరగా నిప్పు అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రయాణంలో ఇవి లీక్ అయి కోచ్ అంతటా వ్యాపిస్తే, చిన్న నిప్పురవ్వ తగిలినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని లగేజీగా తీసుకెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి.
ఒకవేళ మీరు నెయ్యి లేదా నూనెను కేవలం సాధారణ ప్లాస్టిక్ కవర్లలోనో లేదా లూజ్ మూత గల డబ్బాల్లోనో పెట్టి, అది లీక్ అవుతూ రైల్వే సిబ్బందికి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదకర వస్తువులను రవాణా చేస్తే రూ. 1,000 వరకు జరిమానా విధించవచ్చు లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష (లేదా రండూ) పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ వల్ల తోటి ప్రయాణికుల లగేజీ పాడైతే దానికి మీరే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, నెయ్యిని పూర్తిగా నిషేధించలేదు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, నూనె, పెయింట్, నెయ్యి వంటి ఆయిల్ సంబంధిత వస్తువులు సున్నితమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి లీక్ అయితే కంపార్ట్‌మెంట్‌లో కాలుష్యం, భద్రతా సమస్యలు తలెత్తవచ్చు. అయినప్పటికీ, కొన్ని షరతులతో ప్రయాణికులను నెయ్యిని తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం, ఒక ప్రయాణికుడు రైలులో గరిష్టంగా 20 కిలోల నెయ్యిని తీసుకువెళ్లవచ్చు. కానీ, అది సరిగ్గా సీల్ చేయబడి ఉండాలి.
మీరు నెయ్యి లేదా నూనెను తీసుకెళ్లాలనుకుంటే, వాటిని లీక్-ప్రూఫ్ (Leak-proof) కంటైనర్లలో ఉంచాలి. డబ్బా మూత గట్టిగా ఉండి, దానిపై ప్లాస్టిక్ టేప్ చుట్టాలి. ఆపై దాన్ని ఒక మందపాటి కవర్‌లో పెట్టి లగేజీ మధ్యలో సురక్షితంగా ఉంచాలి. కమర్షియల్ ప్రయోజనాల కోసం (అమ్మడానికి) బల్క్ మొత్తంలో తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా పార్సిల్ ఆఫీస్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, తదుపరిసారి రైలు ప్రయాణం చేసేటప్పుడు మీ లగేజీ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..