Rahul Gandhi: కంచుకోటను వదిలి.. దక్షిణాదికి కదిలి.. ఇందిర గాంధీ బాటలో మనవడు..

ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలు గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటలుగా ఇన్నాళ్లూ చెప్పుకున్నాం. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయం నుంచి పరిస్థితి మారింది. కంచుకోటకు బీటలువారాయి. ఆ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి పాలవగా, సోనియా గాంధీ కష్టంగా రాయ్‌బరేలీ నుంచి గట్టెక్కారు.

Rahul Gandhi: కంచుకోటను వదిలి.. దక్షిణాదికి కదిలి.. ఇందిర గాంధీ బాటలో మనవడు..
Rahul Gandhi Gandhi Famil
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 19, 2024 | 3:40 PM

ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలు గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటలుగా ఇన్నాళ్లూ చెప్పుకున్నాం. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయం నుంచి పరిస్థితి మారింది. కంచుకోటకు బీటలువారాయి. ఆ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి పాలవగా, సోనియా గాంధీ కష్టంగా రాయ్‌బరేలీ నుంచి గట్టెక్కారు. అయితే అదృష్టావశాత్తూ రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయడంతో అక్కడ గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టగలిగారు. ఇప్పుడు ఆయన కేరళను తన రాజకీయ స్థావరంగా మార్చుకున్నారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభ సభ్యురాలుగా మారారు. అటువంటి పరిస్థితిలో ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని, అలాగే రాహుల్ గాంధీ తన పాత సీటు అమేథీ నుండి కూడా బరిలోకి దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇద్దరూ యూపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ సాంప్రదాయ స్థానాల నుండి గాంధీ కుటుంబంలోని సభ్యులెవరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఆయన పేరు వాయనాడ్ నుంచి పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి దూరమైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి అమేథీ, రాయ్ బరేలీ స్థానాలపై పడింది. అక్కణ్ణుంచి ఎవరు పోటీ చేస్తారు? కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుంది? అన్నది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

నెహ్రూ-గాంధీ కుటుంబానికి భావోద్వేగ సంబంధం..

నెహ్రూ-గాంధీ కుటుంబానికి అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలతో భావోద్వేగ సంబంధం ఉంది. రాయ్‌బరేలీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి నాలుగు తరాల బంధం ఉండగా.. అమేథీ సీటుతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం 1977లో సంజయ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేసిన నాటిది. ఫిరోజ్ గాంధీ రాయ్ బరేలీ నుండి ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ దానిని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. మొదట సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ అమేథీని తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. అయితే అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయి ఐదేళ్లవుతోంది. కానీ ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి అటు కాంగ్రెస్‌, ఇటు గాంధీ కుటుంబం ఇంకా కోలుకోలేదు. దీంతో అమేథీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం, భావోద్వేగ సంబంధం మునుపటిలా లేదు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు వయనాడ్ స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి చరిత్రలోకి వెళ్తే.. స్వాతంత్ర్యం తరువాత, ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నుండి మొదటి ఎంపీ. దీని తర్వాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాయ్‌బరేలీని తన కార్యక్షేత్రంగా చేసుకుని 1967 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1971 ఎన్నికల్లో కూడా ఇందిరా గాంధీ ఇక్కడ నుండి గెలిచారు. కానీ 1977లో ఆమె జనతా పార్టీకి చెందిన రాజనారాయణ చేతిలో ఓడిపోయారు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ రాయ్‌బరేలీ‌తో పాటు నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని (నేటి తెలంగాణ)లోని మెదక్ నుంచి కూడా పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఆమె రాయ్‌బరేలీ స్థానానికి రాజీనామా చేసి మెదక్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ ఎన్నడూ రాయ్ బరేలీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాదు, గాంధీ కుటుంబంలోని ఏ సభ్యుడు కూడా రాయ్‌బరేలీ స్థానం నుండి సుమారు 43 సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ కుటుంబానికి కానీ దూరపు బంధువులకు మాత్రమే టిక్కెట్ ఇచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి తర్వాత ఇందిర నడిచిన బాటలోనే నడవాలని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ స్థానాన్ని వదిలిపెట్టిన తర్వాత, అరుణ్ నెహ్రూ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు. అరుణ్ నెహ్రూ మోతీ లాల్ నెహ్రూ బంధువు భాయ్ శ్యామ్ లాల్ నెహ్రూ మనవడు. ఇదీ గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరుణ్ నెహ్రూ ఆయనకు సలహాదారుగా ఉన్నారు. కానీ తరువాత కాంగ్రెస్‌ను వీడి వీపీ సింగ్‌తో పాటు చేరారు. అరుణ్ నెహ్రూ 1981, 1984లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీ అయ్యారు. ఆయన జనతాదళ్‌లో చేరినప్పుడు కాంగ్రెస్ షీలా కౌల్‌కు టికెట్ ఇచ్చింది.

షీలా కౌల్ ఇందిరా గాంధీ మామ భార్య. షీలా కౌల్ 1989, 1991లో రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. షీలా కౌల్ తర్వాత, కాంగ్రెస్ 1996లో రాయ్‌బరేలీ నుంచి ఆమె కుమారుడు విక్రమ్ కౌల్‌ను అభ్యర్థిగా చేసింది, కానీ అతను గెలవలేకపోయాడు. దీని తర్వాత 1998లో కాంగ్రెస్ షీలా కౌల్ కుమార్తె దీపా కౌల్‌ను రాయ్‌బరేలీ నుండి అభ్యర్థిగా చేసింది, కానీ ఆమె కూడా గెలవలేకపోయింది. 1999లో కాంగ్రెస్ టిక్కెట్‌పై రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కెప్టెన్ సతీష్ శర్మకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.

కెప్టెన్ శర్మ గాంధీ కుటుంబానికి చెందినవాడు కాదు. కాకపోతే రాజీవ్ గాంధీకి స్నేహితుడు. తనను రాజకీయాల్లోకి రాజీవ్ గాంధీయే తీసుకొచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత అమేథీ లోక్‌సభ స్థానం నుంచి కెప్టెన్ సతీష్ శర్మకు కాంగ్రెస్ టికెట్ లభించింది. ఆ సమయంలో సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ శర్మను అమేథీ నుండి అభ్యర్థిగా చేసింది. కెప్టెన్ శర్మ 1991, 1996లో అమేథీ నుంచి గెలిచి ఎంపీగా ఉండి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998లో కూడా కెప్టెన్ శర్మ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎనిమిదేళ్ల పాటు గాంధీ కుటుంబంలో ఎవరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇందిరా గాంధీ రాయ్‌బరేలీ స్థానాన్ని వదిలిపెట్టినప్పుడు, ఆమె తన స్థానంలో రాయ్‌బరేలీ నుంచి బయటి వ్యక్తులను నిలబెట్టకుండా తన బంధువులపై మాత్రమే నమ్మకం పెట్టుకున్నారు.

1999లో సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అమేథీ ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. కెప్టెన్ సతీష్ శర్మ అమేథీ స్థానాన్ని వదిలిపెట్టి, రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. సోనియా అమేథీ నుంచి ఎంపీగా, కెప్టెన్ శర్మ రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, సోనియా గాంధీ అమేథీ సీటును రాహుల్ కోసం వదిలిపెట్టి, తాను స్వయంగా రాయ్ బరేలీకి మారారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించగా, సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో రాహుల్ అమేథీ నుంచి ఓడిపోయినా, సోనియా రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించి ఎంపీగా కొనసాగారు. ఈ రెండు స్థానాలను గాంధీ-నెహ్రూ కుటుంబం వదులుకున్న ప్రతి సందర్భంలోనూ సమీప లేదా దూరపు బంధువులను బరిలోకి దింపిన ఆనవాయితీని ఈసారి కొనసాగిస్తారా లేక కొత్త సంస్కృతికి తెరలేపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

గాంధీల కంచుకోటలో పోటీ చేసేదెవరు?

2024లో అమేథీ, రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబంలో ఎవరూ పోటీ చేయడం లేదని స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో రాయ్‌బరేలీ, అమేథీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే ఆ నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీతో సీట్ల పంపకంలో కాంగ్రెస్ ఈ రెండు స్థానాలను తమ ఖాతాలోకే తీసుకుంది. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయకపోతే గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకురాలికి మాత్రమే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె తరఫున నియోజకవర్గంలో ప్రతినిధిగా పనిచేసిన కిషోరి లాల్ శర్మకు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. కెఎల్ శర్మ ఎన్నికల సన్నాహాల్లో ఇప్పటికే బిజీగా ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా రాయ్‌బరేలీలో సోనియా గాంధీ పనులన్నీ ఆయనే చూస్తున్నారు కాబట్టి ఓటర్లతోనూ సత్సంబంధాలున్నాయి. అమేథీలో కూడా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకుడికే టికెట్ దక్కనుంది. ఈ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు అవకాశం దక్కించుకునే ఆ వ్యక్తి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఢీకొట్టగలరా అన్నది వేచిచూడాలి.