ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్.. బిర్సా ముండాకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు..!

గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్.. బిర్సా ముండాకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు..!
Birsa Munda Birth Anniversary

Updated on: Nov 15, 2026 | 11:02 AM

న్యూఢిల్లీ: గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తదితర ప్రముఖులు పాల్గొని బిర్సా ముండా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.

బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బిర్సా ముండా అసాధారణ ధైర్యం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. బిర్సా ముండా ఆశయాల నుంచి స్ఫూర్తి పొందుతూ గిరిజనులకు గౌరవం, సమాన అవకాశాలు, అభివృద్ధి, శ్రేయస్సు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. దేశ నిర్మాణంలో గిరిజన సమాజం అందించిన అమూల్యమైన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పిలుపునిచ్చారు.

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ గొప్ప గిరిజన వారసత్వాన్ని, గిరిజన నాయకులు చేసిన చారిత్రక సేవలను గుర్తుచేసుకోవడానికి ఈ రోజు ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా, 2000 నవంబర్ 15న బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అదే రోజు 1875లో బిర్సా ముండా జన్మించడం విశేషం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన, ‘అబువా దిషుమ్, అబువా రాజ్’ (మా భూమి.. మా పాలన) అనే నినాదంతో గిరిజనుల్లో చైతన్యం నింపారు. గిరిజన హక్కులు, ఆత్మగౌరవం, స్వాభిమాన పోరాటానికి ప్రతీకగా నిలిచిన బిర్సా ముండా సేవలను స్మరించుకుంటూ యావత్ దేశం ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us