National Parties: జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు.. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లలో కదలికలు..?

సార్వత్రిక ఎన్నికలు సుదూరంలో వుండగానే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే పరిస్థితి కనిపిస్తోంది. జమిలి ఎన్నికలొచ్చినా కూడా మరో రెండున్నరేళ్ళ తర్వాతనే దేశంలో ఎలక్షన్స్‌కు ఆస్కారం వుంది...

National Parties: జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు.. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లలో కదలికలు..?
Rahul Gandhi ,sonia Gandhi,modi,amith Shah,bjp Flag,congress Flag
TV9 Telugu Digital Desk

| Edited By: Rajesh Sharma

Jul 13, 2021 | 3:44 PM

National Parties focusing on internal changes: సార్వత్రిక ఎన్నికలు సుదూరంలో వుండగానే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే పరిస్థితి కనిపిస్తోంది. జమిలి ఎన్నికలొచ్చినా కూడా మరో రెండున్నరేళ్ళ తర్వాతనే దేశంలో ఎలక్షన్స్‌కు ఆస్కారం వుంది. కానీ ప్రధాన జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీల్లో అంతర్గత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. భారీ కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పలువురు సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. అదే క్రమంలో బీజేపీ అధినాయకత్వం పార్టీలోను మార్పులకు సిద్దమయ్యింది. ఇంకోవైపు కొందరు సీనియర్ నేతలకు గవర్నర్ పదవులను కట్టబెట్టారు ప్రధాన మంత్రి మోదీ. ఇటు కాంగ్రెస్ పార్టీలోను అంతర్గత మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న బెంగాలీ నాయకుడు అధిర్ రంజన్‌ను తొలగించి.. విపక్ష నేతగా మరొకరిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అవుతోంది. ఇంకోవైపు దేశంలో పలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకం దిశగా సోనియా, రాహుల్ ద్వయం సమాలోచనలు జరుపుతోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే జాతీయ పార్టీల సమాయత్తం దేనికి సంకేతమనే దానిపై రాజకీయ పరిశీలకులు భిన్నమైన విశ్లేషణలు ఇస్తున్నారు.

2019లో మేలో ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీనాతి దీన స్థితికి, బీజేపీ అత్యుత్తమ స్థాయికి చేరిన సంకేతాలు కనిపించాయి. బీజేపీ అనూహ్యంగా సొంతంగా మూడు వందలకు పైగా లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. సంకీర్ణ ధర్మానికి కట్టుబడి మిత్రపక్షాలతో కలిసి నరేంద్ర మోదీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాను రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. దేశప్రజలిచ్చిన భారీ మెజారిటీతో 2019లో దూకుడు మీద నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. చిరకాలంగా సమస్యగా మారిన ఆర్టికల్ 370ని రద్దు చేసి.. కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని, మిగిలిన రాష్ట్రాలతో సమానంగా సుందర కశ్మీర్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రెండేళ్ళ క్రితం ఆర్టికల్ 370 రద్దు కాగా.. ప్రస్తుతం కశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో అక్కడ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ మేరకు కశ్మీర్ అఖిల పక్ష సమావేశంలో తానే స్వయంగా ప్రధాన మంత్రి ప్రకటన కూడా చేశారు. ఇదంతా ఒకెత్తయితే.. ఆ తర్వాత ప్రభుత్వంలోను, పార్టీలోను మార్పులకు మోదీ సంకేతాలిచ్చారు. సంకేతాలకు అనుగుణంగానే తన కేబినెట్‌లో భారీ మార్పులు చేశారు. చాలా మంది సీనియర్లను తొలగించారు. కొందరికి ప్రమోషన్ ఇచ్చారు. ఇలా ప్రమోషన్ ఇచ్చిన వారిలో తెలంగాణ బీజేపీ నేత గంగాపురం కిషన్ రెడ్డి కూడా వున్నారు.

కాగా.. కేబినెట్ నుంచి తొలగించిన వారిలో సీనియర్లను బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. రవిశంకర్ ప్రసాద్ లాంటి వారిని పార్టీలోకి తీసుకుంటారని ప్రచారం జరిగినా.. ఆయన్ను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రకాశ్ జవదేకర్‌ను పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదేసమయంలో ఢిల్లీకి చెందిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్దన్‌కు పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిందిగా బీజేపీ అధినాయకత్వం అదేశించే అవకాశాలున్నాయి. అదేసమయంలో ఢిల్లీ విషయంలో కేవలం డా. హర్షవర్ధన్‌పైనే ఆధారపడకుండా.. మీనాక్షి లేఖి లాంటి వారిని కూడా రంగంలోకి దింపనున్నారు. అందుకే ఆమెను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అటు యుపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పలువురిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్న ప్రధాన మంత్రి, పలువురిని పార్టీ తరపున కూడా యుపిపై ఫోకస్ చేయాల్సిందిగా ఆదేశించే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీలోను సంస్థాగత మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జులై 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్ సభలో విపక్ష నేతను మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ప్రస్తుతం విపక్ష నేతగా వున్న అధిర్ రంజన్‌ను తప్పిస్తారని ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌ పార్టీపై అసమ్మతి తెలియజేస్తూ సంస్థాగత మార్పుల కోసం గతంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లోని ఒకరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ గాంధీ మాత్రం వ్యవహరించబోరని తెలుస్తోంది. ఈ పదవికి ప్రధాన పోటీదారులుగా శశిథరూర్‌, మనీశ్‌ తివారీ ఉన్నట్టు సమాచారం. గౌరవ్‌ గొగొయి, రన్‌వీత్‌ సింగ్‌ బిట్టూ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. శశిథరూర్‌, మనీశ్ తివారీ జీ-23 నేతల జాబితాలో ఉన్నారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఇప్పుడు కఠినంగా అమలు జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అధిర్‌ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్‌సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. రెండు పదవులు నిర్వహిస్తున్న మిగతా వారిని కూడా ఒకదాన్నుంచి రిలీవ్‌ చేస్తారని తెలుస్తోంది.

మొత్తమ్మీద రెండు ప్రధాన జాతీయ పార్టీలు సంస్థాగత మార్పులపై దృష్టి సారించాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి త్వరలో జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు.. రెండోది రెండున్నర ఏళ్ళ తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పట్నించే సమాయత్తం అవడం.. ఇలా దూరదృష్టితోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టాయి. వ్యూహాత్మకంగా భవిష్యత్ ప్రణాళికను అమలు పరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu