నిషేధం ఉన్నా నిలువెత్తు దోపిడీ.. పాలీమార్కెట్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే!

భారతదేశంలో బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ, ఆన్‌లైన్ వేదికగా వేల కోట్ల రూపాయల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. దీనికి తాజా నిదర్శనం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సాగుతున్న బెట్టింగ్ ఉధృతి. ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది 'పాలీమార్కెట్'.

నిషేధం ఉన్నా నిలువెత్తు దోపిడీ.. పాలీమార్కెట్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే!
Polymarket Prediction Sites

Updated on: Apr 25, 2026 | 8:59 AM

భారతదేశంలో బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ, ఆన్‌లైన్ వేదికగా వేల కోట్ల రూపాయల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. దీనికి తాజా నిదర్శనం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సాగుతున్న బెట్టింగ్ ఉధృతి. ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది ‘పాలీమార్కెట్’ (Polymarket).

ఏమిటీ పాలీమార్కెట్?

ఇది సాధారణ బెట్టింగ్ సైట్ కాదు, ఇదొక “ప్రిడిక్షన్ మార్కెట్”. భవిష్యత్తులో జరిగే రాజకీయ, సామాజిక పరిణామాలపై అంచనా వేస్తూ ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఉదాహరణకు, ఒక పార్టీ గెలుస్తుందా? అనే ప్రశ్నకు ‘అవును’ లేదా ‘కాదు’ (Yes/No) అనే షేర్లను కొనాలి. ఒక షేర్ ధర 0.40 డాలర్లు ఉంటే, ఆ ఘటన జరిగే అవకాశం 40% ఉందని అర్థం. మీ అంచనా నిజమైతే ఆ షేర్ విలువ 1 డాలర్‌కు పెరుగుతుంది, లేదంటే సున్నా అవుతుంది.

ఎలా ఆకర్షిస్తోంది?

2020లో షేన్ కొప్లన్ ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్, అమెరికా ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. కేవలం రాజకీయాలే కాకుండా యుద్ధాలు, క్రిప్టో ధరలు, వినోద రంగ విశేషాలపై కూడా ఇక్కడ బెట్టింగ్ జరుగుతుంది. ఇటీవల ఇరాన్ యుద్ధ పరిణామాలపై కేవలం మూడు రోజుల్లోనే 100 మిలియన్ డాలర్ల వ్యాపారం జరగడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.

అసలు ముప్పు ఎక్కడ?

భారతదేశంలో ఇది చట్టబద్ధం కాదు. అయినప్పటికీ చాలామంది VPN, క్రిప్టోకరెన్సీ సాయంతో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో ముందే తెలిసిన వ్యక్తులు (Insider Trading) భారీగా లాభపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వెనిజులా అధ్యక్షుడి విషయంలో ఒక అమెరికా సైనికుడు భారీగా గెలవడం దీనికి ఉదాహరణ. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేవిషయం ముందే తెలుసుకుని ఒక అమెరికా సైనికుడు టైమింగ్‌పై బెట్టింగ్ పెట్టాడు. ఆబెట్టింగ్‌లో అతను 4లక్షల డాలర్లకుపైగా బెట్టింగ్ గెలిచాడు. ఇది అమెరికాలో అతిపెద్ద వివాదంగా మారింది. అతనిపై కేసు కూడా నమోదైంది. డాలర్ల ఆశ చూపించి సామాన్యులను ఆకర్షించే ఈ మాయాబజార్, ఒక్క తప్పుడు అంచనాతో మొత్తం పెట్టుబడిని ఆవిరి చేస్తుంది.

ఇన్‌సైడర్ గేమ్‌

ఇరాన్ యుద్ధానికి సంబంధించిన బెట్టింగ్‌లు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 5 నుంచి 8 వరకు మూడురోజుల్లోనే 100మిలియన్ డాలర్లకు పైగా బెట్టింగ్ నడిచింది. మొత్తం 413 మిలియన్ డాలర్ల విలువైన బెట్టింగ్‌లు జరిగాయి. అయితే ఇక్కడో మరో ట్విస్ట్ ఉంది. ఇందులో ఇన్‌సైడర్ గేమ్‌ కూడా నడుస్తోంది. ప్రస్తుతం బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం వేల కోట్లు పందెం కాస్తున్నారు. “దురదృష్టవశాత్తు ప్రపంచం ఒక క్యాసినోలా మారిపోయింది” అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. టెక్నాలజీ ముసుగులో వచ్చే ఇలాంటి బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే, అకౌంట్లు ఖాళీ అవ్వడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. జాగ్రత్త..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us