
థానే (మహారాష్ట్ర): “చేసిన పాపం ఊరికే పోదు.. అది కలలోనైనా వెంటాడుతుంది” అనే నానుడిని నిజం చేస్తూ మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలిలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. 20 రోజుల క్రితం మిత్రుడిని హత్య చేసి కాలువలో పడేసిన నిందితుడు.. మృతుడు నిత్యం కలలోకి వచ్చి తీవ్ర భయాందోళనకు గురిచేస్తుండటంతో తట్టుకోలేక స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోంబివిలి ప్రాంతానికి చెందిన విశాల్ మధుకర్, ప్రభు అనే ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు. అక్టోబర్ 9న ఇద్దరూ కలిసి ఒక అద్దె గదిలో మద్యం సేవించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా పెరిగి పెద్దదై కొట్టుకునే వరకు వెళ్లింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభు, విశాల్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించి, తలపై తీవ్రంగా మోది దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం భయాందోళనకు గురైన ప్రభు, మృతదేహాన్ని గదిలోని బాత్రూమ్లో దాచిపెట్టాడు.
మరుసటి రోజు ఉదయం తాను చేసిన నేరం గురించి ఆ ఇంటి యజమాని సందేశ్‌కు చెప్పి కాపాడాలని వేడుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో మృతదేహాన్ని ఒక గోనెసంచిలో కుక్కి, సమీపంలోని వాగు (కాలువ)లో పడేసి ఆధారాలు దొరక్కుండా చేశారు.
మరోవైపు విశాల్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఎలాంటి ఆధారాలు (క్లూస్) లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు తీవ్ర సవాల్‌గా మారింది.
హత్య జరిగి 20 రోజులు గడిచినా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. కానీ, అపరాధభావమో లేదా మానసిక భయమో ఏమో కానీ, చనిపోయిన విశాల్ రోజు రాత్రి తన కలలోకి వచ్చి భయపెడుతున్నాడని ప్రభు మానసికంగా తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. ప్రశాంతత కరువవ్వడంతో భరించలేక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మిత్రుడు విశాల్ 20రోజులుగా కలలోకి వచ్చి వేధిస్తున్నాడని, తనకు ప్రశాంతత ఉండడంలేదన్నాడు.. నిందితుడు ప్రభు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాగు వద్దకు వెళ్ళి విశాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సహకరించి, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహాయం చేసిన ఇంటి యజమాని సందేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏది ఏమైనా, సాంకేతిక ఆధారాలకు చిక్కని కేసు.. నిందితుడి అపరాధభావం మరియు భయం కారణంగా చివరకు సునాయాసంగా మిస్టరీ వీడింది.