బెంగళూరు, నవంబర్ 27: పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు బాలల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో అధిక మంది విద్యార్థినీ, విద్యార్థినులు తమ వయసుకు మించిన దురుసు ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులను విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇవి ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. స్కూల్ విద్యార్థుల్లో కనీస క్రమశిక్షణా నిబంధనలను అమలు చేయాలని విద్యా మంత్రి మధు బంగారప్పరిని పలువురు కోరారు. దీంతో పాఠశాల స్థాయిలో విద్యార్థుల నియంత్రణకు కనీస నిబంధనలు, ప్రమాణాలు అమలు చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల సంస్థ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి కోరింది. విద్యార్థులు దురుసుగా ప్రవర్తించడం, వేధింపులు, దూషించడం, అసభ్య పదజాలం, ఉపాధ్యాయులపై దాడులు చేయడం వంటి పలు ఫిర్యాదులు విద్యా సంస్థల నుంచి వరుసగా వస్తున్నాయి. కావున విద్యార్థుల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని వివిధ విద్యాసంస్థలు సీఎం సిద్ధరామయ్యకు లేఖలు రాశాయి.
ఇటీవల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు వేదింపులకు గురవుతున్నారు. కొందరు విద్యార్ధుల చేతుల్లో ఉపాధ్యాయులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులను, పాఠశాల సిబ్బందిని అనరాని మాటలతో విద్యార్ధులు దుర్భాషలాడుతున్నారు. కావున ప్రైవేటు విద్యాసంస్థలు దీనికి స్వస్తి చెప్పాలని కోరారు. ఈ పరిస్థితులను ఎదుర్కోలేక చాలా వరకు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, సంరక్షకులు, తల్లిదండ్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి విద్యాసంస్థల్లోనూ ఈ విధమైన సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, విద్యావ్యవస్థపై ప్రభావం పడకుండా ఇలాంటి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు.
సాధారణంగా బాలల హక్కుల కమిషన్ చిన్న కారణాలకే తీవ్రంగా స్పందిస్తుంది. విద్యా శాఖ తీసుకొచ్చిన కఠినమైన నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు సలహాలు కూడా ఇవ్వలేని స్థితికి వచ్చినట్లు పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. అందుకే పాఠశాలల్లో కనీస క్రమశిక్షణ నిబంధనలు అమలు చేయాలనే ఇప్పుడు వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.