Gujarat Elections: చారిత్రత్మాక విజయానికి మూడు మెట్లు.. మోదీ చరిష్మాకు మరో రెండంశాలు తోడవడమే కమల వికాసానికి కారణం

ఎగ్జిట్ పోల్ సర్వేల్లో చూపిన దానికంటే ఎక్కువగా బీజేపీ అక్కడ సీట్లను గెలుచుకోగలిగింది. బీజేపీ ఘన విజయానికి కారణాలను పరిశీలిస్తే రెండు, మూడంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి.

Gujarat Elections: చారిత్రత్మాక విజయానికి మూడు మెట్లు.. మోదీ చరిష్మాకు మరో రెండంశాలు తోడవడమే కమల వికాసానికి కారణం
Prime Minister of India Narendra Modi
Follow us

|

Updated on: Dec 08, 2022 | 6:18 PM

నెలరోజులకుపైగా ఉత్కంఠ రేపిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో రికార్డు మెజారిటీతో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చింది. గత రికార్డులను బద్దలు కొడుతూ ఏడింట ఆరొంతుల మెజారిటీ సాధించి, అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది బీజేపీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నీ తానై చేసిన ప్రచారం కమలం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టింది. మూడు నెలలుగా ప్రతీవారం ఒకట్రెండు రోజులు గుజరాత్ పర్యటనకు వెళ్ళారు మోదీ. వేలాది కోట్ల ప్రాజెక్టులలో కొన్నింటికి శంకుస్థాపన చేశారు.. మరికొన్నింటిని ప్రారంభించారు. 2017లో అత్తెసరు మెజారిటీతో గట్టెక్కిన సందర్భాన్ని, ఆనాటి వైఫల్యాలను బేరీజు వేసుకుని కమలం నేతలు వ్యూహరచన చేశారు. దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసి, తాము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్నారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో ఇపుడు 157 మంది కమలం పార్టీ సభ్యులే ఉండబోతున్నారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఊడ్చేసిన చీపురు గుర్తుతో గుజరాత్‌ను కైవసం చేసుకునేందుకు బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చూపిన ‘ఉచితాలకు’ గుజరాతీలు పడిపోలేదు. దాంతో ఆపార్టీకి సింగిల్ డిజిట్ ‘5’ మాత్రమే దక్కింది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో 12 శాతాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చడం.. కాంగ్రెస్ పార్టీకి అశనిపాతమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లకు పరిమితమైంది. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లలో గెలుపొందగా.. ఈసారి ఆప్ పుణ్యమాని ఆ పార్టీ 16 సీట్లకు పడిపోయింది. దేశం దశను, దిశను మారుస్తున్న తమ రాష్ట్ర నేత నరేంద్ర మోదీకి అండగా నిలవాలన్న సంకల్పం గుజరాతీయుల్లో ప్రబలంగా కనిపించింది. దాంతో ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కూడా కమలానిదే విజయమని తేలింది. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేల్లో చూపిన దానికంటే ఎక్కువగా బీజేపీ అక్కడ సీట్లను గెలుచుకోగలిగింది. బీజేపీ ఘన విజయానికి కారణాలను పరిశీలిస్తే రెండు, మూడంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి.

మోదీ చరిష్మానే మొదటి మెట్టు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా గుజరాతీయులను పెద్ద ఎత్తున ప్రభావం చేసిందనే చెప్పాలి. 2001 తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన నరేంద్ర దామోదర్ మోదీ ఆ తర్వాత తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. 2013లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని బీజేపీ నిర్ణయించే నాటికి ఆయన సారథ్యంలో గుజరాత్ బీజేపీ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. 1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తోంది. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హయ్యస్ట్‌గా 2002లో 127 సీట్లలో విజయం సాధించింది. ఈసారి ఆ సంఖ్య దాటేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఒకట్రెండు సంస్థలు 145 సీట్లను దాటొచ్చని అంచనా వేశాయి. కానీ అసలైన ఫలితాల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా బీజేపీ సీట్లు సాధించింది. బహుశా ఈస్థాయిలో సీట్లు పొందడం భవిష్యత్తులో కూడా ఎవరికీ సాధ్యం కాదేమో అన్న స్థాయిలో బీజేపీ అనితర సాధ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదని ఎవరిని అడిగినా ప్రధాని మోదీ చరిష్మానే అని ఠక్కున చెబుతారు. గుజరాత్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ అందుకు అనుగుణంగానే ఆ రాష్ట్రానికి సమయం కేటాయించారు. ఆల్‌మోస్ట్ రాష్ట్రం మొత్తాన్ని కలియ దిరిగారు. రోడ్ షోలు నిర్వహించారు. దేన్నీ వదలకుండా శ్రమించారు. ఆయన శ్రమ ఫలించింది. బీజేపీ ఘన విజయం సాధించింది.

పటేళ్ళ మద్దతు కీలకం

ఇక బీజేపీ విజయం వెనుక మరో కీలకాంశం పాటీదార్ల మద్దతు. 2017 ఎన్నికలకు ముందు గుజరాత్ రాష్ట్రం పాటీదార్లు ఆందోళనతో దద్దరిల్లింది. వారి ఆందోళన విషయంలో బీజేపీ ఉదారంగా వ్యవహరించడంతో పాటీదార్లు బీజేపీకి దూరమయ్యారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. పాటీదార్ల ఆందోళనలో కీలక పాత్ర వహించిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో 2017 ఎన్నికలు బీజేపీకి ఆందోళన కలిగించే ఫలితాల్నిచ్చాయి. అప్పటి వరకు మూడెంకల సీట్లను గెలుస్తూ వచ్చిన బీజేపీ తొలిసారి డబుల్ డిజిట్ 99కి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తన నెంబర్‌ను గణనీయంగా పెంచుకుని 77 సీట్లలో గెలుపొందింది. ఆనాటి పరిణామాలతో విస్తుపోయిన బీజేపీ.. ఈసారి చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేసింది. పాటీదార్లను మచ్చిక చేసుకునేందుకు వారి వర్గానికి చెందిన భూపేందర్ పటేల్‌కు సీఎం సీటును కట్టబెట్టింది. పాటీదార్ల ఆందోళనకు సారథ్యం వహించిన హార్దిక్ పటేల్‌ను బీజేపీలో చేర్చుకుంది. ఇలాంటి చర్యలన్నీ బీజేపీకి పెద్ద లాభించాయనే చెప్పాలి. వారి మద్దతు కారణంగా బీజేపీ తన సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పెద్దపీట వేయడం గుజరాతీలను బాగా మెప్పించిందనే చెప్పాలి. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్ద ఎత్తున టిక్కెట్లివ్వడం కూడా ప్రయోజనకరంగా మారింది. దాంతో రాష్ట్రం నలుమూలలా బీజేపీ సత్తా చాటగలిగిందనే చెప్పుకోవాలి.

కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన ఆప్

ఇక్కడ మరో కీలకాంశం కూడా విశ్లేషణార్హంగా కనిపిస్తోంది. ఢిల్లీలో తన ప్రస్థానం ప్రారంభించి పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌ను ఏలాలని బయలుదేరింది. ఆ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే ఇచ్చింది కేజ్రీవాల్ పార్టీ. వరుసగా ఆరు సార్లు అధికారంలో వున్న పార్టీ పట్ల ఎంతో కొంత ప్రజావ్యతిరేకత రగులుకోవడం ఖాయం. అయితే, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గణనీయంగా చీల్చడం బీజేపీకి లాభించింది. ప్రస్తుతానికి అందుబాటులో గణాంకాలను చూస్తే.. బీజేపీ 52 శాతం ఓట్లను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 29 శాతం, ఆప్ 12 శాతం ఓట్లను పొందాయి. కేజ్రీవాల్ పార్టీ సాధించిన 12 శాతం ఓట్లు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే.. అంటే అవన్నీ ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ పార్టీకి పడాల్సినవి. కానీ కేజ్రీవాల్ తన ‘ఉచిత’ హామీలతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గణనీయ స్థాయిలో చీల్చారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. 77 సీట్ల నుంచి ఏకంగా 16 సీట్లకు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆప్ పార్టీ కేవలం 5 సీట్లను గెలుచుకున్నప్పటికీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పొందిందనే చెప్పాలి. తొలిసారి పోటీ చేసి ఏకంగా 12 శాతం సీట్లను పొందగలిగింది. పదేళ్ళ క్రితం ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అర్హత పొందే దిశగా గుజరాత్ ఫలితాలు అడుగులు వేయించాయి. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతోపాటు గోవాలో 6 శాతానికి మించిన ఓట్లను పొందిన ఆప్ ఇపుడు నాలుగో రాష్ట్రం గుజరాత్‌లోను 6 శాతాన్ని మించి (12 శాతం) ఓట్లను సాధించింది. రెండు రాష్ట్రాలలోను పెద్దగా సీట్లను గెల్వలేకపోయినా.. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన ఓట్లను సాధించడం కేజ్రీవాల్ ఘనతగానే చెప్పుకోవాలి. ఇపుడీ అర్హత ద్వారా దేశంలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఆప్ పార్టీ ఈవీఎంలలో ఫస్ట్ పేరుగా వుండబోతోంది. ఆ పార్టీ తొలి రెండు అల్ఫాబేట్స్ ఏఏ (AAP) వుండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. మొత్తమ్మీద మూడంశాలు గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయానికి కారణమయ్యాయన్నది విశ్లేషకుల మాట.

Latest Articles