అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్న ట్రస్ట్ రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడిని ప్రతిష్టించబోతున్నట్లు వెల్లడించింది. అలాగే ఇటీవలే రామ జన్మభూమి ట్రస్ట్ సీనియర్ సభ్యులు మందిర నిర్మాణాన్ని పరిశీలించారని చెప్పారు. ట్రస్ట్ సభ్యులు ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ.. సూచనలు చేస్తున్నారని.. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చివరి దశలో ఉందని.. ఈ ఏడాది అక్టోబరు నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇక.. వచ్చే ఏడాది జనవరి కల్లా భక్తుల దర్శనార్థం రామ మందిరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణ కమిటీ భావిస్తోంది. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహప్రతిష్ట వచ్చే జనవరి 22న జరగనుంది. ఇప్పటికే.. పూజకు హాజరుకావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం పంపగా.. స్పందన రావాల్సి ఉంది.
ఇక ఈ సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని శ్రీరాముని ఆలయాలను అలంకరిస్తారు. శ్రీరామ జన్మభూమి ఆలయంలో నిర్వహించే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్చువల్‌గా ప్రదర్శించనున్నారు. మూడంతస్తుల ఆలయ నిర్మాణంలో భాగంగా రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ నుంచి తెచ్చిన రాతిని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రామమందిరంలో గర్భగుడితోపాటు ఐదు మండపాలు ఉంటాయి. ఈ ఐదు మండపాల గోపురాల పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్థంభాలతో నిర్మిస్తున్నారు. బరువు, వాతావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్థంబాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా.. అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోవాలనే కోట్లాది మంది భక్తుల నిరీక్షణకు వచ్చే జనవరితో తెరపడనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..