జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి.. మామూలు స్టోరీ కాదుగా..

జైల్లో ఉండి స్కెచ్ వేయడం.. బయట గ్యాంగ్‌ను నడిపించడం.. పక్కా ప్లాన్‌తో బ్యాంకుపై దాడి చేయించడం! ఇదేదో సినిమా స్టోరీ కాదు.. రియల్ క్రైమ్ స్టోరీ! యస్‌..! మహారాష్ట్రలో జరిగిన ఓ బ్యాంక్ దోపిడీ ఘటన చూస్తుంటే.. సినిమా కథను తలపిస్తోంది! టార్గెట్ చేసిన బంగారం విలువ అక్షరాలా 30 కోట్లు! అదనంగా 15 లక్షల రూపాయల క్యాష్‌ కూడా కొల్లగొట్టారు! ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ ఓ ఖాకీ. పక్కా ప్రణాళికతో సాగిన ఈ దోపిడీలో ఎక్కడెక్కడ ఏం జరిగింది? ఆపరేషన్‌ను ఎలా అమలు చేశారు?

జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి.. మామూలు స్టోరీ కాదుగా..
Sbi Bank Robbery

Updated on: Nov 02, 2026 | 10:01 AM

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా భోకర్ గ్రామం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌! అక్టోబర్ 31.. మధ్యాహ్నం 3 గంటలు. బ్యాంకులో అంతా సాధారణంగానే సాగిపోతోంది. సరిగ్గా అదే సమయంలో హెల్మెట్లు, మాస్కులు ధరించి రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చారు. చూస్తుండగానే తుపాకులు బయటకు తీశారు. బ్యాంకు మేనేజర్.. క్యాషియర్‌ను గురిపెట్టి బెదిరించారు. ఊహించని పరిణామంతో బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపై దాడి చేశారు. భయాందోళనలు సృష్టించేందుకు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత నేరుగా లాకర్ రూమ్‌పై పడ్డారు! ఏకంగా 16 లాకర్లను బద్దలు కొట్టారు! అందులో ఉన్న బంగారం, నగదును ఆరు సంచుల్లో సర్దేశారు. కోట్ల విలువైన బంగారంతో బ్యాంకును ఖాళీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. దోపిడీకి గురైనా బంగారం విలువ అక్షరాలా 30 కోట్లు! అదనంగా 15 లక్షల రూపాయల నగదు!

దుండగుల కోసం పోలీసుల వేట.. ఓ దుండగుడిని పట్టుకున్న గ్రామస్తులు

బ్యాంక్ దోపిడీ విషయం తెలియగానే పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. నిందితులు పారిపోయే మార్గాలపై నిఘా పెట్టి రహదారులపై తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు స్థానిక గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరిస్తూ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో విద్గావ్ సమీపంలో ఓ నిందితుడిని గ్రామస్తులు పట్టుకున్నారు. అతడి దగ్గరి నుంచి దోపిడీ సొత్తులో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటు పోలీసులు కూడా గాలింపు ముమ్మరం చేసి వేర్వేరు ప్రాంతాల్లో మిగిలిన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. నాలుగు సంచులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో ఒక్కొక్కరి వివరాలు బయటపడుతున్న కొద్దీ ఈ కేసులో అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దోపిడీ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌.. ఒకప్పుడు ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాజీ పోలీస్ అధికారి!

మాజీ ఎస్‌ఐ శంకర్ రమేష్ జసక్‌గా గుర్తింపు

ఆ మాజీ అధికారి పేరు శంకర్ రమేష్ జసక్! మహారాష్ట్ర పోలీస్ విభాగంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, గతంలో విధుల నుంచి సస్పెండ్‌ అయిన జసక్.. ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్ల బ్యాంక్ దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. జైలులో ఉన్న సమయంలోనే ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్లు సమాచారం. ఒకప్పుడు ఖాకీ యూనిఫామ్‌లో పనిచేసిన వ్యక్తిపైనే ఇంత భారీ దోపిడీకి స్కెచ్ వేశాడనే అనుమానాలు రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు పోలీసులు అతడి క్రైమ్ నెట్‌వర్క్‌పై ఫోకస్ పెట్టారు. జైల్లో ఉండగా బయట గ్యాంగ్‌తో ఎలా లింక్ అయ్యాడు? ఈ దోపిడీకి ముందు బ్యాంకుపై రెక్కీ చేసింది ఎవరు? దోచుకున్న బంగారాన్ని ఎక్కడికి తరలించారు? ఇలా ప్రతి లింక్‌ను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. దోపిడీలో ఒక్కొక్కరి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us