Delhi Elections: ఢిల్లీలో రాహుల్ ఎన్నికల ప్రచారం షురూ.. మోదీ, కేజ్రీపై విసుర్లు

|

Jan 13, 2025 | 9:23 PM

Delhi Election News: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంటోంది. మూడు పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ధరల నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇద్దరూ విఫలం చెందారని ఆయన ధ్వజమెత్తారు.

Delhi Elections: ఢిల్లీలో రాహుల్ ఎన్నికల ప్రచారం షురూ.. మోదీ, కేజ్రీపై విసుర్లు
Rahul Gandhi in Delhi Rally
Follow us on

Delhi Assembly Election 2025: ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నిత్యవసర సరకుల ధరలను నియంత్రించడంలో వారిద్దరూ విఫలం చెందారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సీలాంపూర్ ఏరియాలో జరిగిన తన తొలి ఎన్నికల ప్రచార సభలో.. ధరాఘాతంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా పేదవారు మరింత పేదవారు అవుతుండగా.. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కోసం కోటీశ్వరులు అంబానీ, అదానీలు మార్కెటింగ్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అంబానీ, అదానీలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ, అర్వింద్ కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. మోదీ, కేజ్రీవాల్‌ వారికి వ్యతిరేకంగా మాట్లాడటం మీరెప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. బిల్లియనీర్ల దేశం మనకు అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ రెండూ ధ్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రతిరోజూ దాడి చేస్తున్నారని ఆరోపించారు. అంబానీ, అదానీలు యావత్ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని.. అన్ని వ్యాపారాలను నియంత్రిస్తున్నారన్నారు. ఢిల్లీని ప్యారిస్ నగరంలా మారుస్తామని కేజ్రీవాల్ గతంలో చెప్పుకున్నారని గుర్తుచేశారు. అయితే అవినీతి నిర్మూలన, కాలుష్య నియంత్రణ, ద్రవ్యోల్బణ నియంత్రణలో కేజ్రీవాల్ విఫలం చెందారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు, కుల గణనకు మద్ధతు ఇస్తున్నారో లేదో ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ని ప్రశ్నించాలన్నారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ..

కులగణనపై కేజ్రీవాల్‌ని నిలదీయాలన్న రాహుల్

ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

1998 నుంచి 2013 వరకు 15 ఏళ్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాల్లో ఆప్ గెలిచింది. మూడో సారి అక్కడ అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది.