గ్యాస్ సరఫరాపై కేంద్రం మరో కీలక అప్‌డేట్.. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు..

వివిధ రంగాలకు నాన్-డొమెస్టిక్ ఎల్‌పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ అవసరాల గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, వాణిజ్య అవసరాలకు తగిన కేటాయింపులు చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా..

గ్యాస్ సరఫరాపై కేంద్రం మరో కీలక అప్‌డేట్.. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు..
Domestic Gas Cylinders

Updated on: Mar 27, 2026 | 12:42 PM

దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు వాణిజ్య అవసరాల (Non-Domestic) ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అధికారిక లేఖ రాసింది. గ్యాస్ సిలిండర్ల వినియోగంలో పారదర్శకతను పెంచడం, దుర్వినియోగాన్ని అరికట్టడం ముఖ్య ఉద్దేశ్యం. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇండస్ట్రీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య ఎల్‌పిజి (LPG) కేటాయింపులపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50 శాతం కేటాయింపులకు అదనంగా మరో 20 శాతాన్ని పెంచుతూ, మొత్తం కోటాను సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 70 శాతానికి పెంచింది. ఈ అదనపు కేటాయింపుల్లో స్టీల్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, డై, కెమికల్స్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇది కార్మిక శక్తి ఎక్కువగా ఉన్న రంగాలు, ఇతర అవశ్యక రంగాలకు తోడ్పాటునివ్వనుంది.

సహజ వాయువు(Natural Gas)తో భర్తీ చేయలేని ప్రత్యేక హీటింగ్ అవసరాలు ఉన్న పరిశ్రమలకు, ప్రాసెస్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేక అవసరాల కోసం ఎల్‌పిజి వాడే పరిశ్రమలకు కొన్ని రిజిస్ట్రేషన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాల్లోని పారిశ్రామిక కార్యకలాపాలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుందని పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు. అలాగే, సంస్కరణల ఆధారితంగా లభించే అదనపు 10 శాతం కోటాను కూడా రాష్ట్రాలు వెంటనే వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ నిబంధనల అమలు ద్వారా అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌ను అరికట్టవచ్చని, అర్హులైన గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా చూడవచ్చని కేంద్రం భావిస్తోంది.

Follow Us