BJP Plan: తమిళ పాలిటిక్స్‌లో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అంటున్న బీజేపీ

| Edited By: Balaraju Goud

Mar 20, 2024 | 6:29 PM

కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే కాదు.. 400 ప్లస్ టార్గెట్‌గా భారతీయ జనతా పార్టీ తన నినాదంగా చెబుతోంది. చెప్పడమే కాదు అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ద్రవిడవాద రాజకీయాలు బలంగా ఉన్న తమిళ గడ్డపై గట్టిగానే కొడతామంటోంది. తమిళనాట దశాబ్దాలుగా ఎప్పుడూ లేనివిధంగా బీజేపీ ప్లాన్ వేసింది.. బలమైన కూటమిగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

BJP Plan: తమిళ పాలిటిక్స్‌లో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అంటున్న బీజేపీ
Tamilnadu Bjp
Follow us on

కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే కాదు.. 400 ప్లస్ టార్గెట్‌గా భారతీయ జనతా పార్టీ తన నినాదంగా చెబుతోంది. చెప్పడమే కాదు అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ద్రవిడవాద రాజకీయాలు బలంగా ఉన్న తమిళ గడ్డపై గట్టిగానే కొడతామంటోంది. తమిళనాట దశాబ్దాలుగా ఎప్పుడూ లేనివిధంగా బీజేపీ ప్లాన్ వేసింది.. బలమైన కూటమిగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా శతాధిక పార్టీలు ఉన్నాయి తమిళనాట. ఒక్కో కూటమిలో పదికి పైగా పార్టీలు ఉండడం ఇక్కడ సర్వసాధారణం. మినిమిమ్ ఐదు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో తలపడుతుంటాయి. ఎన్నికలన్నాక కూటములు.. కూటమి అన్నాక పార్టీలు ఉండడం సహజం. అనేక ఈక్వేషన్స్‌తో మరిన్ని పార్టీలతో కలిసి వెళ్ళాక తప్పదు ఒక్కోసారి..! తమిళనాట ఒక్కసారి కాదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఇక్కడ పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం సెంటిమెంట్‌గా చూస్తుంటారు.

ఒకప్పుడు ద్రవిడ వాదం బలంగా ఉన్న తమిళనాట రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా తమ అవసరాల కోసం ఆ సెంటిమెంట్‌నే కొనసాగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో నడిచిన డీఎంకే, జయలలిత లీడ్ చేసిన ఎఐడీఎంకే, ఆతర్వాత ఆ ఇద్దరు లేని ఆపార్టీల్లో కూడా పొత్తులు, అందులో అనేక పార్టీలు కూటమిలో బరిలోకి దిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్న తమిళనాడులో గట్టిగా కొట్టాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. అందుకు ఎన్నికలు సమీపించిన సందర్భంలో ఇప్పటికిప్పుడు అనుకున్న ఆలోచన కాదు. గడిచిన కొన్నేళ్లుగా ప్లాన్ ప్రకారం పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తోంది బీజేపీ.

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల పదికి పైగా పర్యటనలు చేసి సుమారు 35 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2019 ఎన్నికల్లో ఎఐడిఎంకేతో కలిసి పొత్తుతో బరిలో నిలిచిన బీజేపీ సక్సెస్ కాలేకపోయింది. 2014 లో కన్యాకుమారి ఒక్క స్థానంలో గెలిచింది. అయితే 2019లో బోణి కూడా కొట్టలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆతర్వాత బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఐపీఎస్ అధికారి అన్నామలై వీఆర్ఎస్ తీసుకుని పార్టీలో చేరారు. పార్టీ చీఫ్‌గా అవకాశం ఇచ్చింది అధిష్టానం.

ద్రవిడ వాదం బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాయంటూ ద్రవిడ వాద పార్టీలపై పోరాటం, హిందూత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ మంచి ఫలితాలను సాధించగలిగింది. అలాగే డీఎంకే అధికారంలోకి వచ్చాక జరిగిన అవినీతి చిట్టా విడుదలతో అన్ని వర్గాలను టచ్ చేసింది బీజేపీ. ఇక ప్రతిపక్ష ఎఐడిఎంకేలో ఓపిఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య ఉన్న పోరుతో బలహీనంగా ఉంది పార్టీ. ఓపిఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఓపిఎస్ ప్రస్తుతం బీజేపీతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ గట్టిగానే పనిచేస్తోంది.

తమిళనాడులో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలే కూటమి ఏర్పాటు చేసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కొన్ని సీట్లు కేటాయించే పరిస్థితి ఉండేది. గత ఎన్నికల్లో ఎఐడీఎంకే బీజేపీకి ఐదు లోక్‌సభ స్థానాలను కేటాయించింది. ఇప్పుడు బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయిస్తోంది. పుదుచ్చేరి ఒక ఎంపీ స్థానం, తమిళనాడులో 39 స్థానాలు ఉండగా 20 స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధమవుతోంది. తమిళనాడులో వన్నియార్ సామాజికవర్గ ఓటు బ్యాంకు బలంగా ఉన్న పీఎంకేకు 10 స్థానాలు కేటాయించింది బీజేపీ. ఓపిఎస్ కు 2, టిడివి దినకరన్ ఏర్పాటు చేసిన AMMK కు 3 స్థానాలు, తమిళ మానిల కాంగ్రెస్ (TMC) 2 స్థానాలు, విద్యాసంస్థల అధినేతలకు మరో రెండు స్థానాలు ఇవ్వగా, మిగిలిన స్థానాల్లో బీజేపీ బరిలో నిలవబోతోంది. తమిళ పార్టీల పంచన చేరి ఇచ్చినన్ని సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి నుంచి బీజేపీ సొంతంగా కూటమిని ఏర్పాటు చేయడం ఇపుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…