మహిళా రిజర్వేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. లోక్‌సభ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు, ఓబీసీ వర్గాలకు కోటా లేదని, ఇది అన్యాయం అని అన్నారు. ఈ కారణంగానే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఎంపీ అసదుద్దీన్.
”మీరు తక్కువ ప్రాతినిథ్యం ఉన్నవారికి ప్రాతినిథ్యం ఉండేలా బిల్లును తీసుకువస్తున్నారు. అయితే, మన దేశంలో ఇప్పటి వరకు 70 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 8,992 మంది ఎంపీలు ఎన్నికైతే.. అందులో 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. అంటే.. 50 శాతానికి పైగా లోటు ఉంది. ఇక ఆ 520 మందిలోనూ స్త్రీలు గుప్పెడు మంది కూడా లేరు. మరి మీరు ఈ బిల్లు ద్వారా ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనుకుంటున్నారు? అవసరం ఉన్నవారికి ప్రాతినిథ్యం ఇవ్వాలి. ముస్లిం, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కోటా లేకపోవడం ఈ బిల్లులోని ప్రధాన లోపం. అందుకే ఈ బిల్లును మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.” అని స్పష్టం చేశారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
కాగా, దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త పార్లమెంట్ హౌస్‌లో మొదటి సెషన్ ప్రారంభమైన వెంటనే అంటే సెప్టెంబర్ 19వ తేదీన మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బుధవారం చర్చ జరుగనుంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
కాగా, 15 ఏళ్లపాటు వర్తించే ఈ రిజర్వేషన్ బిల్లును.. గత 27 ఏళ్లలో అనేకసార్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రతిసారి ఆ బిల్లు వీగిపోయింది. చివరిసారిగా 2010లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. రాజ్యసభలో ఆమోదం లభించింది కానీ, లోక్‌సభలో వీగిపోయింది. దాంతో ఆ బిల్లు అలా మూలన పడిపోయింది. ఇప్పడు బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా ఈ బిల్లు ఆమోదానికి సిద్ధంగా ఉండటంతో.. ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లు పక్కా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, ఇవాళ కొత్త పార్లమెంట్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అజ్జున్ రామ్ మేఘ్‌వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం నాడు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లు పాసైతే.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా రిజర్వేషన్ అమలువుతుంది. ఇక ఈ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం 128వ రాజ్యాంగ సవరణ చేస్తోంది.
2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదా?
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2024 ఎన్నికలకు మహిళా బిల్లు అమలు లేనట్టే కనిపిస్తోంది. ఈ సెషన్‌లో పాస్ అయినా, ఆపై ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమల్లోకి రానుంది. నియోజకవర్గాల పునర్‌విభజన తర్వాతే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. ఈ రిజర్వేషన్.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా అమలుకానున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రాకపోవచ్చని చెబుతున్నారు. ఇక నియోజకవర్గాల పునర్‌విభజన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. నియోజకవర్గాల పునర్‌విభజన తర్వాతే మహిళా కోటా అమలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లో రిజర్వేషన్ అమల్లోకి వస్తాయి. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రిజర్వేషన్లు రొటేషన్ ప్రకారం అమల్లోకి రానున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. పార్లమెంట్‌లో 30 శాతం సీట్లు పెరగనున్నాయి.
ప్రతిపక్షాల విమర్శలు..
మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లు ప్రతులను తమకు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు విపక్ష పార్టీల నేతలు. దీనికి స్పందించిన ప్రభుత్వం.. డిజిటల్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేశామని బదులిచ్చింది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. 2010లోనే రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించిందని, కాంగ్రెస్‌కు బిల్లుపై క్రెడిట్ ఇవ్వడం ప్రధానికి ఇష్టం లేదని విమర్శించారు.
#WATCH | Delhi: On Women’s Reservation Bill, AIMIM Chief Asaduddin Owaisi says, “…Who are you giving representation to? Those who don’t have representation should be given representation. The major flaw in this bill is that there is no quota for Muslim women and so we are… pic.twitter.com/LIrU5RJiaQ
— ANI (@ANI) September 19, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..