
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం వాటిల్లదని, ఈ నిర్ణయం అందరికీ మేలు చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన వేళ అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయని, ప్రస్తుతం ఉన్న పరిష్కార మార్గాల్లో 50 శాతం సీట్ల పెంపే అత్యంత సమంజసమైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతుందన్న ఆందోళనల నేపథ్యంలో సీట్ల నిష్పత్తిపై చంద్రబాబు కీలక వివరాలు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 129 లోక్‌సభ స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత వీటి సంఖ్య 195కు చేరుతుంది. అయితే దక్షిణాదికి ఉన్న 23.76 శాతం వాటాలో ఎలాంటి మార్పు ఉండదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. 50 శాతం పెంపు అమలైతే ఇవి 38కి పెరుగుతాయి. కానీ రాష్ట్రం వాటా అయిన 4.6 శాతం అలాగే కొనసాగుతుంది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న 28 స్థానాలు పెంపు తర్వాత 42 అవుతాయి. ఆ రాష్ట్రానికి ఉన్న 5.16 శాతం వాటాలోనూ ఎలాంటి తేడా రాదు’’ అని అన్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రక ముందడుగులు వేస్తోందని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా దీని కోసం నిరీక్షిస్తున్నామని, ఈ విషయంలో కేంద్రంతో కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం దక్కాలని, మహిళల హక్కుల సాధనలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ కోసం పలువురు నేతలు చేసిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ, ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై కొన్ని పార్టీలు లేవనెత్తిన అనుమానాలను తొలగిస్తూ, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం దక్కేలా సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేలా బిల్లును రూపొందించారని తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు కూడా ఆలోచించి మద్దతు ఇవ్వాలని, లేనిపక్షంలో మహిళలకు, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కుమారస్వామి స్పష్టం చేశారు.