2008 Ahmedabad serial bomb blast case: గుజరాత్ అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. 2008లో అహ్మదాబాద్ ( Ahmedabad ) లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లు (serial bomb blast) సంభవించాయి. ఈ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది. వారిలో 38 మంది కీలక దోషులుగా ప్రకటించిన ప్రత్యేక ధర్మాసనం.. వారికి మరణ శిక్ష విధించింది. అంతేకాకుండా మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సీరియల్ బాంబు పేలుళ్ల ఘటనపై సుధీర్ఘంగా విచారించిన ప్రత్యేక కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. 48 మంది దోషులకు ఒక్కొక్కరికి రూ.2.85 లక్షల చొప్పున జరిమానా విధించింది. మొత్తం 78 మంది నిందితుల్లో 49 మందిని భారత శిక్షాస్మృతిలోని వివిధ నేరాల కింద, హత్య, దేశద్రోహం, పేలుడు పదార్థాల చట్టం పలు నేరాల కింద దోషులుగా ప్రత్యేక న్యాయమూర్తి ప్రకటించారు. ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ ఈ కేసులో తుది తీర్పును వెలువరించారు. పేలుళ్లలో మరణించిన వారికి రూ.లక్ష నష్టపరిహారం అందజేయాలని.. అలాగే తీవ్ర గాయాలపాలైన బాధితులకు రూ.50 వేలు, మైనర్ బాధితులకు రూ.25 వేలు పరిహారం అందజేయాలని తీర్పు చెప్పారు. కాగా.. ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్ష విధించడం దేశంలో ఇదే తొలిసారి.
2008 జూలై 26న అహ్మదాబాద్‌లో సివిల్ హాస్పిటల్, ఎల్‌జి హాస్పిటల్‌తో సహా వివిధ ప్రదేశాల్లో గంట వ్వవధిలోనే 22 బాంబులు వరుసగా పేలాయి. బస్సులు, పార్కింగ్, ఇతర ప్రదేశాలలో మొత్తం 56 మంది మరణించారు. దాదాపు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. మొత్తం 24 బాంబులలో కలోల్, నరోడా వద్ద అమర్చిన బాంబులు పేలలేదు. అయితే.. ఈ ఘటనకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (IM) బాధ్యత వహిస్తూ కొన్ని మీడియా సంస్థలకు ఇమెయిల్ పంపింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2008 నుంచి సుధీర్ఘ విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.
నిషేధిత సిమీకి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ 13ఏళ్ల పాటు కొనసాగింది. గుజరాత్ స్పెషల్ కోర్ట్ 1,100 మందికి పైగా సాక్షులను విచారించింది. గతేడాది సెప్టెంబర్‌లో 77 మంది నిందితులపై ప్రత్యేక కోర్టు విచారణ ముగించింది. వీరిలో 49 మందిని దోషులుగా తేల్చింది.
Also Read: