Jamili Elections: ‘‘జమిలి’’ ముచ్చట తీరేదెన్నడు.. ఆసక్తికర కథనం మీకోసం..

|

Feb 18, 2022 | 11:36 AM

Jamili Elections: జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్‌సభ నుంచి పంచాయతీల వరకూ..

Jamili Elections: ‘‘జమిలి’’ ముచ్చట తీరేదెన్నడు.. ఆసక్తికర కథనం మీకోసం..
Jamili Elections
Follow us on

Jamili Elections: జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్‌సభ నుంచి పంచాయతీల వరకూ ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ జమలి ఎన్నికలపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ మరోసారి ఉపందుకుంటోంది. కేంద్రం కోరుకుంటున్న వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్ సాకారమయ్యేనా? అందుకు విపక్షాలు సహకారమందిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జమలి ఎన్నికలపై టీవీ9 తెలుగు ప్రత్యేక కథనం..

లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనేది కేంద్ర ప్రభుత్వ వెర్షన్‌. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని ఈ మాట ఇప్పటిది కాదు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. 2019 బీజేపీ మానిఫెస్టోలో కూడా పెట్టారు. నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ఎన్నికలు తరచూ జరగడం మూలంగా సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు.. వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడుతోందని ప్రభుత్వం అంటోంది. అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే.. ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని మోదీ భావిస్తే.. అమలు పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సై అంటున్న తెలుగు రాష్ట్రాలు..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రధాన పార్టీలు జమిలి ఎన్నికలకు సై అంటున్నాయి. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఎలక్షన్స్‌ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించారు. అప్పుడే జమిలీ ఎన్నికల అవశ్యకత గురించి ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. వామపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా గతంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. పార్లమెంట్‌లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించేస్తామని చెప్పింది. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే రాజ్యాంగ సవరణ అంత కష్టమేమీ కాదు.

జమిలి కొత్తేం కాదు..
కాగా, దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి. జమిలీ ఎన్నికలు జరగాలి అంటే.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుకోవాలి. ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. ఒకే దేశం – ఒకే ఎన్నిక అనేది అత్యంత అవశ్యమని ఆయన చెబుతున్నారు. అందుకే జమలీ ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.

జమిలి ఎన్నికలు అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు జరగడం గందరగోళం అవుతుంది. సంవత్సరం మొత్తం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక జరగడం వల్ల వ్యయం ఎక్కువ అవుతోంది, శ్రమ ఎక్కువైపోతుంది అన్న వాదన ఉంది.

5 ఎన్నికలతో తేలిపోయింది..
అయితే 2023లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనుకున్నప్పుడు యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు ఈసీ చర్యలు తీసుకునేది కాదు. ఒక వేళ 2023 జమిలి ఎన్నికలు అంటే ఎన్నికైన ఆ అయిదు రాష్ట్రాల ప్రభుత్వాలను ఏడాదిలో రద్దు చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వేళ జమిలి ఎన్నికలు పెట్టాలని భావిస్తే యూపీ, పంజాబ్, గోవా, మేగాలయ, ఉత్తరాఖండ్ ఎన్నికల బదులు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేది. లేదా ఏడాదో రెండేళ్లో అసెంబ్లీని పొడిగించాల్సి ఉండెది.

వెయిట్ చేయక తప్పదా?
2025లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు 2024లో ఏపిలో ఎన్నికలు నిర్వహించకూడదు. ఇదే ప్రభుత్వాన్ని ఏడాది పాటు కొనసాగించాలి. ఒక వేళ 2029 లో జమిలీ ఎన్నికలకు పోవాలంటే ఇప్పుడు జరుగనున్న అయి రాష్ట్రాల పదవీ కాలం అయిదేళ్లు 2027కు పూర్తి అవుతున్నందున ఈ రాష్ట్రాల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించాల్సి ఉంటుంది. ఇలా జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అంటే పలు రాష్ట్రాల పదవీ కాలాన్ని కుదించాలి. మరి కొన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని పెంచాల్సి ఉంటుంది. దీనికి ఆయా రాష్ట్రాల తీర్మానాలు తప్పనిసరి. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే కనీసం 20 రాష్ట్రాల నుండి మేము జమిలికి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాలి. ఆ తరువాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి, లా కమిషన్ కు పంపించాలి. అభ్యంతరాలు లేవని చెప్పాలి. అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపాలి. రాష్ట్రాలకు సంబంధం లేకపోతే కేంద్రం తలుచుకుంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా పెట్టేయవచ్చు.. కానీ దీనికి రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి. ఇవన్నీ పరిశీలిస్తే జమిలి ఎన్నికలు జరగాలంటే మరికొంత కాలం వెయిట్‌ చేయక తప్పదనే అభిప్రాయం వినిపిస్తుంది.