కరోనా..ఆగస్టు 15 లోగా వ్యాక్సీన్… ఐసీఎంఆర్ టార్గెట్..విపక్షాల ఫైర్

కరోనా చికిత్సలోఉపయోగపడే దేశీయ వ్యాక్సీన్ ని ఆగస్టు 15 లోగా డెవలప్ చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) టార్గెట్ విధించడంపై పలువురు వైద్య నిపుణులు, డాక్టర్లు సందేహాలు వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు..

కరోనా..ఆగస్టు 15 లోగా వ్యాక్సీన్... ఐసీఎంఆర్ టార్గెట్..విపక్షాల ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 11:39 AM

కరోనా చికిత్సలోఉపయోగపడే దేశీయ వ్యాక్సీన్ ని ఆగస్టు 15 లోగా డెవలప్ చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) టార్గెట్ విధించడంపై పలువురు వైద్య నిపుణులు, డాక్టర్లు సందేహాలు వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించేప్పుడు ఇది తమ ఘనతగా చెప్పుకోవడానికే ఈ డెడ్ లైన్ విధించినట్టు ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ వ్యాక్సీన్ కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ 12 ఆసుపత్రుల డాక్టర్లకు లేఖ రాశారు. కబళిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ఈ వ్యాక్సీన్ ని డెవలప్ చేయడం ఎంతయినా అవసరమని, ఈ విషయంలో రెడ్ టేపిజం పనికిరాదని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని, తద్వారా ‘నిర్ధారణ’ లో జాప్యానికి ఆస్కారం ఉండదని ఆయన పేర్కొన్నారు. అయితే దీన్ని తీసుకున్న వ్యక్తి ఆగస్టు 14 లేదా 15 నాటికి పూర్తిగా రోగనిరోధక శక్తిని సంతరించుకోగలుగుతాడా అని ఎలా చెప్పగలమని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా అనుమానం వ్యక్తం చేశారు. ఇది సాధ్యం కాదన్న విషయం ఈ సంస్థకు కూడా తెలుసునన్నారు. క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఐసీఎంఆర్ ఈ లేఖ రాసిందన్నారు. కాగా ఇలాంటి విషయాల్లో ‘ఆర్డర్’ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. టార్గెట్ విధించడమన్నది ప్రధాని మోదీ రెడ్ ఫోర్ట్ పై నుంచి ప్రసంగించేటప్పుడు ఆయన రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడానికేనని స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్ నేత పృథ్వీ రాజ్ చవాన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినదని  ఆయన విమర్శించారు.