బెంగాల్‌ను వేధిస్తున్నారు-మమత

Mamata slams BJP, బెంగాల్‌ను వేధిస్తున్నారు-మమత

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల పేరు చెప్పి పశ్చిమ బెంగాల్‌ ప్రజలను బీజేపీ, కేంద్ర బలగాలు ఎందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. లేనిపోని వివాదాలు తెరపైకి తీసుకువచ్చి అల్లర్లు సృష్టించారని అన్నారు. గతంలో తాను ఎన్నడూ ఇటువంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజల జీవితాలతో ఆడుకున్నాయని అన్నారు. తనను ఎదుర్కొనే సత్తా లేక ఇలా అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు విడతల్లోనూ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నేడు ఆఖరి విడత పూర్తయింది. ఐదో విడత నుంచి మొదలైన అల్లర్లు అనంతరం తారస్థాయికి చేరుకోవడంతో కొందరు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ఏడో విడత ఎన్నికలకు నాలుగు రోజుల ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రోడ్‌షో నిర్వహించారు. అప్పుడే మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అక్కడ ప్రచార గడువును ఒక రోజు కుదించింది. మోదీ ర్యాలీ అనంతరం ప్రచారాన్ని నిషేధించిందని ఈసీపై మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. కాగా మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *