
వర్షాకాలం ప్రారంభమైన వెంటనే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలో, తోటల్లో, గ్యారేజీల్లో, స్టోర్‌రూమ్‌లలో పాములు కనిపిస్తుంటాయి. భారీ వర్షాలతో పాముల బొరియలు నీటితో నిండిపోవడం, అలాగే వాటి ఆహారమైన ఎలుకలు, కప్పలు, బల్లులు జనావాసాల వైపు వస్తుంటాయి. దీంతో పాములు సైతం సురక్షితమైన, పొడి ప్రదేశాల కోసం ఇళ్ల పరిసరాలకు చేరుకుంటాయి. అందుకే వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే పాములు
1. కామన్ క్రైట్ (కట్లపాము)
వర్షాకాలంలో ఇళ్లలోకి ఎక్కువగా ప్రవేశించే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో కట్ల పాము ఒకటి. ఇది ప్రధానంగా రాత్రిపూట చురుకుగా ఉంటుంది. చీకటి గదులు, మెట్ల కింద, స్టోర్‌రూమ్‌లు, చెప్పుల దగ్గర, చెత్త కుప్పల మధ్య దాక్కుంటుంది. ఎలుకల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పాము కాటు మొదట్లో పెద్దగా నొప్పి కలిగించకపోవచ్చు. అందువల్ల చాలా మంది ప్రమాదాన్ని గుర్తించలేరు. అయితే దీని విషం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి శ్వాస ఆడకపోవడం, పక్షవాతం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చు.
2. భారతీయ నాగుపాము
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ విషసర్పాల్లో నాగుపాము ఒకటి. వర్షాలతో సహజ నివాసాలు దెబ్బతింటే పొలాలు, తోటలు, ఇళ్ల పరిసరాల్లోకి వస్తుంది. నాగుపాము విషం కూడా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.
3. రస్సెల్స్ వైపర్
పొలాలు, గడ్డి ప్రాంతాలు, పొదల్లో ఎక్కువగా కనిపించే ఈ పాము వర్షాకాలంలో జనావాసాలకు చేరుకుంటాయి. దీని విషం రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీసి అంతర్గత రక్తస్రావం, అవయవాల దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది.
4. సా-స్కేల్డ్ వైపర్ (రంపపు పొలుసుల వైపర్)
పరిమాణంలో చిన్నదైనా ఇది కూడా అత్యంత విషపూరితమైన పాము. ఇసుక ప్రాంతాలు, పొదలు, రాళ్ల కుప్పలు, చెత్త గుట్టల్లో దాక్కుంటుంది. వర్షాల సమయంలో ఇళ్ల చుట్టూ ఉన్న చెత్త, గడ్డి మధ్య కూడా కనిపిస్తుంది.
ఇంటి దగ్గర పాములు ఉన్నాయనడానికి సంకేతాలు:
పాము విడిచిన కుబుసం కనిపించడం
దుమ్ము లేదా మట్టిలో వంకరగా ఉన్న జాడలు
గడ్డి లేదా చెత్త కుప్పల్లో కదలికలు
చీకటి మూలల నుంచి బుసకొట్టే శబ్దం వినిపించడం
ఇంటి చుట్టూ ఎలుకల సంఖ్య ఒక్కసారిగా పెరగడం
పాములు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు!
ఇంటి చుట్టూ పెరిగిన గడ్డి, పొదలను తొలగించండి.
చెత్త, కట్టెలు, ఇటుకలు, పాత వస్తువుల కుప్పలను ఇంటికి ఆనించి ఉంచవద్దు.
గోడల పగుళ్లు, తలుపుల కింద ఉన్న ఖాళీలు, పైపుల రంధ్రాలను మూసివేయండి.
డ్రెయిన్‌లకు మెష్ అమర్చండి.
ఎలుకల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు టార్చ్ ఉపయోగించండి.
తోట పనులు చేసేటప్పుడు బూట్లు, చేతి తొడుగులు ధరించండి.
చెప్పులు వేసుకునే ముందు లోపల పరిశీలించండి.
పాము కనిపిస్తే ఏం చేయాలి?
మన ఇంటి పరిసరాల్లో పాము పామును పట్టుకునే ప్రయత్నం చేయకండి. కర్రలు, రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించవద్దు. దానికి దూరంగా ఉండి, కుటుంబ సభ్యులను సురక్షిత ప్రదేశానికి పంపించాలి. స్థానిక అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వండి.
పాము కరిస్తే ఏమి చేయాలి?
* బాధితుడిని ప్రశాంతంగా ఉంచండి.
* కాటు వేసిన అవయవాన్ని వీలైనంత వరకు కదలకుండా ఉంచండి.
* గాయం కోయడం, విషం పీల్చడం, బిగిగా కట్టడం వంటి పద్ధతులు పాటించవద్దు.
* వీలైనంత త్వరగా సమీప ఆసుపత్రికి తరలించి యాంటీ స్నేక్ వెనం చికిత్స పొందేలా చూడాలి.
నిపుణులు ఏమంటున్నారు?
వర్షాకాలంలో పాములు మనుషులపై దాడి చేయడానికి రావు. వరదల నుంచి తప్పించుకోవడం, ఆశ్రయం పొందడం, ఆహారం వెతకడం కోసం మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పాము కనిపిస్తే దానిని రెచ్చగొట్టకుండా నిపుణుల సహాయం తీసుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు.
గమనిక: పాముల జాతిని స్వయంగా గుర్తించే ప్రయత్నం చేయకండి. ఏ పాము కాటైనా అత్యవసర వైద్య పరిస్థితిగానే పరిగణించి వెంటనే ఆసుపత్రికి వెళ్లడం అత్యంత సురక్షితం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..