నెలల వయస్సున్న పిల్లల నుంచి పెద్దల వరకూ స్మార్ట్ ఫోన్ ఒక వ్యసనంలా మారిపోయింది. చేతిలో ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పిల్లల చేతుల్లోనూ విరివిగా ఫోన్లు కనిపిస్తున్నాయి. పిల్లలు మారం చేస్తున్నారనో లేక ఏడుస్తున్నారనో.. అన్నం తినడం లేదనో వారికి తల్లిదండ్రులే ఫోన్లను అప్పజెప్పి వారి పనుల్లో వారు నిమగ్నం అవుతున్నారు. అయితే తాత్కాలిక ఉపశమనంగా భావిస్తున్న తల్లిదండ్రులకు ఆ ఫోన్ల వల్ల పిల్లలకు కలిగే దుష్ ప్రభావాన్ని అంచనా వేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఇక స్కూల్, కాలేజీలకు వెళ్తున్న పిల్లలు ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి పిల్లలు వెళ్లిపోతున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో అనేక అధ్యాయాలు వెల్లడిచేశాయి. అలాగే పలువురు టెక్ దిగ్గజాలు కూడా చెబుతున్నారు. ఏకంగా ఫోన్లు తయారు చేసిన వారే.. సోషల్ మీడియాలో అనేక యాప్ లను తయారు చేసిన పెద్ద పెద్ద దిగ్గాజాలే పిల్లలకు ఫోన్లు అలవాటు చేయవద్దని, తమ పిల్లలకు ఇవ్వడం లేదని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పలు సందర్భాల్లో వారు తెలిపిన వివరాలు మీకు అందిస్తున్నాం ఓ సారి చూడండి..
‘మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం మానేయండి!’ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ప్రముఖ ఫోన్ల తయారీ దారైన జియోమీ ఇండియా మాజీ సీఈఓ మను కుమార్ జైన్. ఆయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో దీనిని రాశారు. స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో ఉన్నాయని చెప్పారు. క్షీణిస్తున్న మానసిక ఆరోగ్యానికి స్మార్ట్‌ఫోన్ వినియోగానికి మధ్య సంబంధాన్ని హైలైట్ చేసిన యూఎస్ ఆధారిత సేపియన్ ల్యాబ్స్ ఇటీవలి నివేదికను ఆయన ఉటంకిస్తూ తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానేయాలని సూచించారు.
మైక్రోసాఫ్ట్ మాజీ చీఫ్ బిల్ గేట్స్ కూడా వీరి పిల్లలు 14 ఏళ్ల వరకు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్ ప్రస్తుత బాస్ సత్య నాదెళ్ల , ఆయన భార్య అనుతో కలిసి, 2017 ఇంటర్వ్యూలో తమ పిల్లలకు గ్యాడ్జెట్లను పరిమితంగానే అనుమతిస్తామని చెప్పారు.
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 2011 ఇంటర్వ్యూలో తన పిల్లలు కొత్తగా విడుదల చేసిన ఐప్యాడ్‌ను ఉపయోగించకుండా నిషేధించానని చెప్పారు. తమ పిల్లలు ఇంట్లో టెక్నాలజీని ఎంత వినియోగించాలో ముందే హెచ్చరిస్తామని వారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
యూకేలోని టాప్ శామ్‌సంగ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ కిట్టో ఈ ఏడాది ప్రారంభంలో ఒక ఇంటర్వ్యూలో తన కుమార్తెకు 11 ఏళ్లు వచ్చే వరకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వలేదని చెప్పారు.
మరి ఫోన్లు తయారు చేస్తున్న ఆయా కంపెనీల అధిపతులే తమ పిల్లలకు గ్యాడ్జట్లను ఇవ్వడం లేదని, చాలా పరిమితంగా టెక్నాలజీని వినియోగించుకునేలా చేస్తున్నామని చెబుతున్న తరుణంలో తల్లిదండ్రులు కూడా ఓ సారి ఆలోచించాలి. పిల్లల మానసిక స్థితిని ప్రభావితం చేసే ఈ ఫోన్లను ఇవ్వకపోవడం మంచిది.
లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 40% పైగా పట్టణ భారతీయ తల్లిదండ్రులు తమ తొమ్మిది నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు సోషల్ మీడియా, గేమింగ్, వీడియోలకు బానిసలుగా ఉన్నారని అంగీకరించారు. మరొక అధ్యయనం భయంకరమైన ధోరణిని హైలైట్ చేసింది. దాని ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే 11 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు డిజిటల్ స్నేహితులను మాత్రమే కలిగి ఉండటం వంటి సమస్యాత్మక ప్రవర్తనను ప్రదర్శిస్తారని వివరించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ టెక్నాలజీలను కనిపెట్టి, ప్రారంభించిన అనేక కంపెనీలకు చెందిన అధిపతులు తమ పిల్లలపై కఠినమైన ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగాన్ని క్రమపరిచామని చెబుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ, స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వినియోగం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కి బదులుగా పిల్లలకు అవుట్ డోర్ గేమ్స్ ఆడనివ్వాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.. ఫోన్ల వంటి గ్యాడ్జెట్లు ఎంత దూరం పెడితే అంత మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..