బ్రష్‌ చేసిన తరువాత కూడా నోటి దుర్వాసన తగ్గటం లేదా..? డెంటల్ సర్జన్ చెప్పిన పరిష్కారాలు ఇవే!

చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుందని దాదాపుగా అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉండవచ్చు. నోటి దుర్వాసన అనేది కేవలం ఒక వ్యక్తిగత ఇబ్బంది మాత్రమే కాదు, అది లోపల ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం అంటున్నారు దంత వైద్యులు. నోటి దుర్వాసన (Bad Breath) సమస్యకు గల కారణాలు, వాటిని నివారించే మార్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బ్రష్‌ చేసిన తరువాత కూడా నోటి దుర్వాసన తగ్గటం లేదా..? డెంటల్ సర్జన్ చెప్పిన పరిష్కారాలు ఇవే!
Bad Breath

Updated on: Apr 13, 2026 | 7:31 AM

ఈ రోజుల్లో నోటి దుర్వాసన ఒక సాధారణ సమస్యగా మారింది. నోటి దుర్వాసన ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అలాంటి వారు బహిరంగంగా మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. కొంతమందికి నోటి దుర్వాసన ఎంత తీవ్రంగా ఉంటుందంటే, వారి చుట్టూ కూర్చోవడానికి కూడా తోటివారు భయపడుతుంటారు. ఇది వారి సామాజిక జీవితాలపై ప్రభావం చూపుతుంది. బ్రేసెస్ & ఫేసెస్ మల్టీ-స్పెషాలిటీ డెంటల్ సెంటర్‌లోని డెంటల్ సర్జన్ డాక్టర్ సాంత్వనా పయాసి, నోటి దుర్వాసనకు గల కారణాలను, దానిని ఎలా అధిగమించాలో వివరిస్తున్నారు.

వైద్యుల ప్రకారం.. చాలామంది నోటి దుర్వాసన (Halitosis) సమస్యను ఎదుర్కొంటూ ఇతరులతో మాట్లాడటానికి వెనుకాడుతుంటారు. దీనిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే మౌత్ వాష్‌లను వాడటం తాత్కాలిక పరిష్కారమే. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం ముఖ్యమని డెంటల్ సర్జన్ డాక్టర్ సాంత్వనా పయాసి వివరిస్తున్నారు. నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు మనం తిన్న ఆహార పదార్థాలు పళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు, అక్కడ బ్యాక్టీరియా చేరి దుర్వాసనను విడుదల చేస్తుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం లేదా ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల కూడా నోరు వాసన వస్తుందని చెబుతున్నారు.

నోటిలో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు బ్యాక్టీరియాను శుభ్రం చేసే ప్రక్రియ మందగిస్తుందని చెబుతున్నారు. అలాగే, సైటస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ లేదా కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో కూడా విభిన్నమైన నోటి దుర్వాసన కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, దీనికి నివారణ మార్గాలు, చికిత్స కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి.

బ్యాక్టీరియా ఎక్కువగా నాలుకపై చేరుతుంది. కాబట్టి టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. నోరు పొడిబారకుండా చూసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి నోరు తాజాగా ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసన ఇచ్చే పదార్థాలను తగ్గించాలి. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. తప్పనిసరిగా ప్రతి ఆరు నెలలకోసారి డెంటిస్ట్‌ను సంప్రదించి ప్రొఫెషనల్ క్లీనింగ్ (Scaling) చేయించుకోవాలి. నోటి దుర్వాసనను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా మీ అంతర్గత ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us