కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు పచ్చగా ఉంటుంది..

మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోయి నల్లగా మారిపోతోందా? ఎంత జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టినా వాడిపోయి పారేయాల్సి వస్తోందా? అయితే వంటగదిలో మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్లే.. నిత్యం వంటల్లో వాడే కొత్తిమీరను ఐస్ క్యూబ్స్‌గా మార్చడం దగ్గరి నుండి.. కేవలం గాజు గ్లాసు నీటితో వారాల తరబడి పచ్చగా ఉంచే అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు పచ్చగా ఉంటుంది..
How To Keep Coriander Leaves Fresh Longe

Updated on: Jun 07, 2026 | 12:18 PM

భారతీయ వంటకాల్లో కొత్తిమీర ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూర ఏదైనా సరే.. చివర్లో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. అయితే మార్కెట్ నుండి తెచ్చిన రెండు రోజులకే కొత్తిమీర ఆకులు నల్లగా మారిపోవడం, కుళ్లిపోవడం ప్రతి మహిళ ఎదుర్కొనే పెద్ద సమస్య. తేమ లేదా సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. కొత్తిమీరను వారాల తరబడి తాజాగా.. సువాసన భరితంగా ఉంచుకోవడానికి అద్భుతమైన ఆయుర్వేద కిచెన్ హాక్స్ గురించి తెలుసుకుందాం..

వేర్లను నీటిలో ఉంచడం

కొత్తిమీరను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం ఇదీ. కొత్తిమీర కట్టకు ఉన్న వేర్ల మట్టిని ముందుగా శుభ్రంగా కడగాలి. ఒక గాజు గ్లాసు లేదా చిన్న జాడీలో కొద్దిగా నీరు పోసి, కేవలం వేర్లు మాత్రమే మునిగేలా అందులో కొత్తిమీరను నిలువుగా పెట్టాలి. ఆ తర్వాత పైన ఒక ప్లాస్టిక్ కవర్‌ను వదులుగా కప్పి ఫ్రిజ్‌లో భద్రపరచండి. అయితే ప్రతి రెండు రోజులకు ఒకసారి గ్లాసులోని నీటిని మారుస్తూ ఉంటే కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

పేపర్ టవల్ – జిప్‌లాక్ బ్యాగ్ ట్రిక్

కొత్తిమీర కట్టలో ముందుగా పాడైపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఏరి పారేయాలి. ఎందుకంటే ఒక్క ఆకు కుళ్లినా.. అది మిగతా వాటికి కూడా వ్యాపిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉన్న కొత్తిమీరను ఒక పొడి పేపర్ టవల్ లేదా పత్తి గుడ్డలో చుట్టాలి. ఇలా చుట్టిన కొత్తిమీరను గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో దాచుకుంటే చాలా రోజుల వరకు పాడవదు.

కడిగి ఆరబెట్టి నిల్వ చేయడం..

కొత్తిమీరను కడిగి నిల్వ చేసుకునే అలవాటు ఉంటే ఈ నియమం తప్పక పాటించాలి. ఆకులను శుభ్రంగా కడిగిన తర్వాత, వాటిలోని నీరు పూర్తిగా పోయేలా ఆరబెట్టాలి. తడి లేదా తేమ ఏమాత్రం ఉండకూడదు. తేమ ఆరిపోయాక, వాటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ డబ్బా అడుగున పొడి పేపర్ టవల్ వేసి, దానిపై ఈ తరిగిన కొత్తిమీరను వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఐస్ క్యూబ్ టెక్నిక్

కొత్తిమీరను ఫ్రీజ్ చేయడం ద్వారా నెలల తరబడి వాడుకోవచ్చు. కొత్తిమీర ఆకులను బాగా కడిగి, నీరు వడకట్టి, సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ తరుగును ఇంట్లోని ఐస్ క్యూబ్ ట్రే గడులలో వేయండి. అందులో కొద్దిగా ఆలివ్ నూనె లేదా నీళ్లు పోసి ఫ్రీజర్‌లో పెట్టి ఐస్ ముక్కలుగా మార్చండి. వంట చేసేటప్పుడు ఈ కొత్తిమీర ఐస్ క్యూబ్స్‌ను నేరుగా కూరల్లో వేసేసుకోవచ్చు.

పసుపు నీటితో క్రిమిసంహారక చిట్కా..

  • బాక్టీరియా వల్ల కొత్తిమీర త్వరగా కుళ్లిపోకుండా ఉండటానికి పసుపు నీరు అద్భుతంగా పనిచేస్తుంది.
  • ఒక గిన్నెడు నీటిలో కొద్దిగా పసుపు వేసి, కొత్తిమీర ఆకులను 20 నుండి 30 నిమిషాల పాటు అందులో నానబెట్టాలి.
  • పసుపులోని యాంటీ బాక్టీరియా గుణాలు క్రిములను చంపేస్తాయి.
  • ఆ తర్వాత, వాటిని తీసి మళ్లీ మంచి నీటితో కడిగి ఆరబెట్టాలి.
  • తేమ పూర్తిగా ఆరిపోయాక, గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేసుకుంటే కొత్తిమీర అస్సలు పాడవదు.
Follow Us