
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా మందికి అధికంగా చెమట పడుతుంది. సాధారణంగా చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడినప్పటికీ కొంతమందిలో మాత్రం అధిక చెమట చర్మ సమస్యలకు దారితీస్తుంది. వైద్యుల ప్రకారం చెమట ఎక్కువసేపు చర్మంపై ఉంటే తేమ పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది చర్మంపై మంట, దురద, ఎర్రటి మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మెడ, చంకలు, వీపు, తొడల వద్ద అధికంగా చెమట పడితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా చెమటతో కలిసిన దుమ్ము, ధూళి చర్మంపై ఉండిపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎక్కువసేపు తడి బట్టలు ధరించడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలను పాటించడం అవసరం. అవేంటంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో శరీరాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీకు ఎక్కువగా చెమట పట్టినప్పుడు ముఖం, శరీరం కడుక్కోవాలి. గాలి సరిగ్గా ప్రసరించడానికి వీలుగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. దీనివల్ల చెమట త్వరగా ఆరిపోతుంది. పుష్కలంగా నీళ్లు తాగడం, తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకపోవడం కూడా ముఖ్యం. ఇతరుల తువ్వాళ్లు, బట్టలు, వ్యక్తిగత వస్తువులను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. చర్మంపై నిరంతరం మంట, ఎరుపు దద్దుర్లు, దురద వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. సరైన పరిశుభ్రత, సంరక్షణ వేసవిలో చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.