
నేటి ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అకాల జుట్టు నెరవడం. ఒకప్పుడు 50 ఏళ్లు దాటాక కనిపించే తెల్ల జుట్టు, ఇప్పుడు 20 ఏళ్లకే పలకరిస్తోంది. దీంతో కుర్రాళ్లు కూడా ముసలివారిలా కనిపిస్తున్నామనే ఆందోళనతో మార్కెట్లో దొరికే రసాయన రంగులు వాడుతున్నారు. అయితే ఇవి జుట్టును మరింత దెబ్బతీయడమే కాకుండా చర్మ అలెర్జీలకు దారితీస్తున్నాయి. ఈ తరుణంలో మన పూర్వీకులు అందించిన ఆయుర్వేద రహస్యం భృంగరాజ్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
ఆయుర్వేదంలో భృంగరాజ్‌ను కేశరాజ్ అని పిలుస్తారు. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో దీనికి సాటిలేదు. జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని ఇది సహజంగా ప్రేరేపిస్తుంది.
దీని వల్ల కలిగే ప్రయోజనాలు:
న్యాచురల్ డై: జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇస్తుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది: కుదుళ్లను దృఢంగా మార్చి హెయిర్ ఫాల్ సమస్యను నివారిస్తుంది.
చుండ్రు నివారణ: తలలో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గించి చుండ్రును తరిమికొడుతుంది.
మానసిక ప్రశాంతత: భృంగరాజ్ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.
ఖరీదైన పార్లర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఈ చిట్కాతో తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు.
కావలసినవి: భృంగరాజ్ ఆకుల పొడి (లేదా తాజా ఆకుల పేస్ట్), కొంచెం హెన్నా , ఉసిరి పొడి.
తయారీ విధానం: ఒక ఇనుప పాత్రలో ఈ మూడింటిని నీటితో కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇనుప పాత్ర వాడటం వల్ల మిశ్రమానికి ఐరన్ గుణాలు తోడై జుట్టు మరింత నల్లగా మారుతుంది.
నిల్వ ఉంచడం: ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా అలాగే ఉంచండి. అప్పుడు ఆ మిశ్రమం నల్లగా మారుతుంది.
అప్లై చేయడం: మరుసటి రోజు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, కనీసం 2 గంటల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో స్నానం చేయాలి. షాంపూ వాడకపోవడం ఉత్తమం.
ఇది రసాయన రంగు కాదు కాబట్టి ఒక్క రోజులోనే ఫలితం ఆశించకూడదు. కనీసం వారానికి ఒకసారి చొప్పున కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా వాడితే అద్భుతమైన మార్పును గమనించవచ్చు. తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నవారు ఒకసారి నిపుణులను సంప్రదించడం మంచిది.