
ఇందుకోసం గోధుమ లేదా వరి గడ్డి, పుట్టగొడుగుల విత్తనం, కొద్దిగా ఎరువు ఉంటే సరిపోతుంది. సరైన తేమ, నీడ ఉండేలా చూసుకుంటే సుమారు 25 నుంచి 30 రోజుల్లో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. ఇంట్లోనే వీటిని ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం.
గోధుమ లేదా వరి గడ్డి
పుట్టగొడుగుల విత్తనం (మష్రూమ్ స్పాన్)
వర్మీ కంపోస్ట్ లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువు
కుండీ లేదా గ్రో బ్యాగ్
నీళ్లు
1. గడ్డిని సిద్ధం చేసుకోవాలి: ముందుగా గోధుమ లేదా వరి గడ్డిని నీటిలో బాగా నానబెట్టాలి. అందులోని దుమ్ము, మట్టి తొలగిపోయేలా శుభ్రం చేయాలి. తర్వాత అదనపు నీటిని తీసేయాలి.
2. ఎరువు కలపాలి: తడిగా ఉన్న గడ్డిలో వర్మీ కంపోస్ట్ లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువును కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.
3. కుండీలో నింపాలి: సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కుండీ లేదా గ్రో బ్యాగ్‌లో వేయాలి. మధ్యమధ్యలో పుట్టగొడుగుల విత్తనాలను చల్లుతూ పొరలుగా నింపాలి.
4. నీడలో ఉంచాలి: కుండీని నేరుగా ఎండ పడని చల్లని ప్రదేశంలో ఉంచాలి. పుట్టగొడుగులు పెరగడానికి తేమ చాలా ముఖ్యం. అందుకే అవసరాన్ని బట్టి నీటిని స్ప్రే చేయాలి.
5. పంటను కోయాలి: సరైన ఉష్ణోగ్రత, తేమ ఉంటే సుమారు 25 నుంచి 30 రోజుల్లో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభమవుతాయి. పూర్తిగా పెరిగిన తర్వాత జాగ్రత్తగా కోసుకోవాలి.
కుండీలో నీరు నిల్వ ఉండకూడదు.
గడ్డికి తగినంత తేమ ఉండాలి.
నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి.
కుండీ, గ్రో బ్యాగ్ శుభ్రంగా ఉండాలి.
నాణ్యమైన పుట్టగొడుగుల విత్తనాలనే ఉపయోగించాలి.
గమనిక: పుట్టగొడుగుల పెరుగుదల రకం, ఉష్ణోగ్రత, తేమ, సాగు పద్ధతిని బట్టి మారుతుంది. కలుషితమైన లేదా బూజు పట్టిన పుట్టగొడుగులను ఆహారంగా ఉపయోగించకూడదు.