
మన దేశంలో కారం పొడి లేకుండా ఏ వంటా పూర్తి కాదు. కూరలకు చక్కటి రంగు, ఘాటైన రుచిని జోడించడానికి ప్రతి ఒక్కరూ కారన్ని అత్యధికంగా ఉపయోగిస్తారు. రుచికరమైన చేపల పులుసు నుండి ఘాటైన చికెన్ కూరల వరకు.. కారం పొడి పడితేనే ఆ కిక్కే వేరు. అయితే పూర్వం లాగా మిరపకాయలు కొని, ఎండబెట్టి, మిల్లు ఆడించే ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు. చాలామంది మార్కెట్లో దొరికే ప్యాకెట్ కారం పొడిపైనే ఆధారపడుతున్నారు. కానీ నేడు మార్కెట్లో లభించే కారం పొడిలో విపరీతంగా కల్తీ జరుగుతున్నట్లు వెల్లడైంది. కేవలం లాభాల కోసం కొందరు మోసగాళ్లు కారం పొడిలో ఇటుక పొడి, ఇసుక, సుద్ద పొడి, రంపపు పొడి, ప్రమాదకరమైన కృత్రిమ రంగులను కలుపుతున్నారు.
ఈ కల్తీ కారం పొడిని లాంగ్ టర్మ్ వాడటం వల్ల కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కానీ ఇకపై దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బాస్. మీరు కొనుగోలు చేసే కారం పొడి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి ఇంట్లోనే చేసుకోగల కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
కారం పొడిలో ఉండే ఇటుక పొడి, ఇసుక మరియు రంగులను గుర్తించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం.
ఎలా చేయాలి?: ముప్పావు గ్లాసు శుభ్రమైన నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ కారం పొడి వేసి, నెమ్మదిగా వదిలేయండి.
ఫలితం: మంచి కారం పొడి నీటిలో త్వరగా మునిగిపోదు. కాసేపు నీటిపై తేలుతూ ఉంటుంది. ఒకవేళ అది నకిలీదైతే.. చాలా వేగంగా గ్లాసు అడుగుకు చేరుకుని, అక్కడ ఒక మందపాటి పొరలా పేరుకుపోతుంది.
ఎలా చేయాలి?: కొద్దిగా కారం పొడి తీసుకుని మీ అరచేతుల మధ్య వేళ్లతో బాగా రుద్దండి.
ఫలితం: రుద్దినప్పుడు ఆ పొడి మీ చేతులకు గరుకుగా తగిలితే, అందులో ఇటుక పొడి లేదా ఇసుక కలిపారని అర్థం. ఒకవేళ అది చాలా మెత్తగా, సబ్బు పొడిలా జారుడుగా అనిపిస్తే.. అందులో సబ్బురాయి లేదా సుద్ద పొడి కలిపి ఉండే అవకాశం ఉంది.
ఎలా చేయాలి?: ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకుని అందులో కొద్దిగా కారం పొడి కలపండి.
ఫలితం: నూనెలో కారం వేయగానే అది వెంటనే ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారిపోతే, అందులో కృత్రిమ రంగు కలిపారని గ్రహించాలి. ఎందుకంటే స్వచ్ఛమైన కారం పొడి తన రంగును నూనెలోకి విడుదల చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది.
ఎలా చేయాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కారం పొడి వేసి బాగా కలపండి.
ఫలితం: కొంత సమయం తరువాత, ఒకవేళ అందులో చెక్క పొడి కలిసి ఉంటే.. ఆ చెక్క రేణువులు నీటిపై తేలుతాయి. స్వచ్ఛమైన కారం పొడి రేణువులు ఈ విధంగా నీటిపై తేలవు.
మార్కెట్లో కారం పొడి కొనేటప్పుడు కేవలం కలర్ చూసి మోసపోకండి. ఎల్లప్పుడూ నమ్మకమైన బ్రాండ్లను లేదా FSSAI లోగో ఉన్న ప్యాకెట్లను మాత్రమే ఎంచుకోండి. లేబుల్ లేకుండా లూజ్‌గా అమ్మే పొడులను అస్సలు వాడకండి. వీలైతే, మార్కెట్ నుండి మంచి నాణ్యత గల ఎండు మిరపకాయలను కొని.. వాటిని శుభ్రంగా కడిగి, ఎండబెట్టి, మిల్లులో ఆడించుకోవడం అన్నిటికంటే సురక్షితమైన మార్గం.