
ప్రతి రోజూ వంటింట్లో బియ్యం కడగడం ఒక నిరంతర ప్రక్రియ. కానీ చాలా మంది బియ్యాన్ని పదేపదే, బలంగా నూరి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని, పైగా నష్టాలే ఎక్కువని ఆరోగ్య నిపుణులు, ప్రముఖ చెఫ్‌లు హెచ్చరిస్తున్నారు. బియ్యాన్ని పండించేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు రకరకాల పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తుంటారు. అలాగే ప్యాకింగ్ చేసే సమయంలో దుమ్ము, చిన్న రాళ్లు, పొట్టు వంటివి అందులో చేరతాయి. వీటన్నింటితో పాటు బియ్యంపై ఉండే అదనపు పిండిపదార్థాన్ని శుభ్రం చేయడానికి వండే ముందు కడగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల అన్నం ముద్దగా అవ్వకుండా, చక్కగా పొడిపొడిగా, పొడవుగా వస్తుంది.
బియ్యాన్ని పదేపదే బలంగా రుద్ది కడగడం వల్ల అందులోని కీలకమైన పోషకాలు పూర్తిగా నశిస్తాయి. బియ్యపు పైపొరలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ బి-కాంప్లెక్స్, ఐరన్, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. బియ్యాన్ని ఎక్కువసార్లు రుద్దినప్పుడు ఈ పోషకాలన్నీ నీటిలో కరిగి వృధాగా పోతాయి. దీనివల్ల అన్నం తిన్నా శరీరానికి అందాల్సిన శక్తి లభించదు. అంతేకాదు ఎక్కువసార్లు కడగడం వల్ల బియ్యం యొక్క సహజ సువాసన, రుచి కూడా తగ్గిపోతాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బియ్యాన్ని గరిష్టంగా రెండు లేదా మూడు సార్లు మాత్రమే కడగాలి. నీళ్లు పూర్తిగా పారదర్శకంగా మారేంత వరకు కడగాల్సిన అవసరం లేదు.
మొదటిసారి: బియ్యంలో నీళ్లు పోసి, చేతులతో తేలికగా పిసకడం వల్ల అందులోని దుమ్ము, మైక్రోప్లాస్టిక్ కణాలు తొలగిపోతాయి. ఆ నీటిని వంపేయాలి.
రెండోసారి: బియ్యం గింజలు విరగకుండా చాలా తేలికగా కడగాలి. దీనివల్ల రసాయనాల ప్రభావం తగ్గుతుంది.
మూడోసారి: మరోసారి నీళ్లు పోసి తేలికగా కలిపితే బియ్యం పూర్తిగా వండుకోవడానికి సిద్ధమవుతాయి.