పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

ఈ చిక్కు ప్రశ్న మనకు తర్కశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యం, సరైన ప్రణాళిక ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. చిన్న సమస్యలా కనిపించినా సరైన క్రమంలో ఆలోచిస్తే పరిష్కారం సులభంగా దొరుకుతుంది. పిల్లలకు ఇలాంటి లాజిక్‌ ప్రశ్నలు ఇచ్చి వాటిని పరిష్కరించమని ఇస్తే.. వారి తర్కిక జ్ఞానం మెరుగుపడుతుంది. నది ఒడ్డున రైతు.. మూడు సమస్యలు కథ చదివేయండి..

పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న
Famous Farmer River Puzzle

Updated on: Jun 03, 2026 | 8:12 PM

ఒక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. ఒకరోజు అతను తన పులి, మేక, గడ్డి కట్టను నది అవతలి ఒడ్డుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడికి వెళ్లడానికి ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. ఆ పడవలో రైతు కాకుండా ఒక్కసారికి ఏదైనా ఒక వస్తువు లేదా ఒక జంతువు మాత్రమే తనతో తీసుకెళ్లగలడు. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. పులిని మేకతో ఒంటరిగా వదిలేస్తే పులి మేకను తినేస్తుంది. మేకను గడ్డి కట్టతో ఒంటరిగా వదిలేస్తే మేక గడ్డిని తినేస్తుంది. దీంతో రైతు ఏది ముందుగా తీసుకెళ్లాలి? ఏది వెనక్కి తీసుకురావాలి? అనే చిక్కు పరిస్థితి ఏర్పడింది. ఇందుకు రైతు చాలా ఆలోచించి చివరికి ఇలా చేశాడు:

మొదటి దశ

ముందుగా మేకను పడవలో తీసుకుని నది అవతలి ఒడ్డుకు వెళ్లాడు. అప్పుడు ఈ ఒడ్డున: పులి + గడ్డి మాత్రమే ఉన్నాయి. ఆ ఒడ్డున మేక ఉంది. ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు.

రెండో దశ

రైతు తిరిగి వచ్చి పులిని తీసుకుని అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఇప్పుడు అక్కడ పులి, మేక రెండూ ఉన్నాయి. కాబట్టి ప్రమాదం ఉంది. అందుకే… తెలివిగా ఒక పని చేశాడు.

మూడో దశ

పులిని అక్కడే వదిలి, మేకను మళ్లీ తనతో పాటు ఈ ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పుడు ఈ ఒడ్డున మేక + గడ్డి ఉంటుంది. ఆ ఒడ్డున పులి ఉంటుంది.

నాలుగో దశ

ఇప్పుడు రైతు గడ్డి కట్టను తీసుకుని అవతలి ఒడ్డుకు వెళ్లాడు. అప్పుడు ఆ ఒడ్డున పులి + గడ్డి ఉంటుంది. ఈ ఒడ్డున మేక ఉంటుంది. ఇక్కడ కూడా ఎలాంటి సమస్య లేదు.

ఐదో దశ

రైతు తిరిగి వచ్చి చివరిసారిగా మేకను తీసుకుని అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఇలా పులి, మేక, గడ్డి కట్ట మూడింటినీ సురక్షితంగా నది దాటించాడు.

ఎందుకు ఇలా చేయాలంటే?

రైతు మొదట మేకను నది దాటించాడు. పులిని దాటించిన తర్వాత ఎందుకు మేకను తిరిగి తీసుకొచ్చాడంటే రైతు అక్కడ లేకపోతే పులి మేకను తినేస్తుంది. అలాగే గడ్డిని దాటించే సమయంలో ఎందుకు మేకను ఈ ఒడ్డునే వదిలాడంటే మేక లేకపోతే గడ్డి సురక్షితంగా ఉంటుంది. పులి, మేక ఇద్దరూ ఒంటరిగా ఉండకూడదు. మేక, గడ్డి కట్ట ఇద్దరూ ఒంటరిగా ఉండకూడదు. అందుకే మేకను మధ్య మధ్యలో తిరిగి తీసుకురావడం ద్వారా సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి నిజజీవితంలోనూ సమస్య ఎంత క్లిష్టంగా కనిపించినా, సరైన క్రమంలో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.

“తెలివిగా ఆలోచించడం, ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడం ఏ సమస్యనైనా పరిష్కరించగలదు.”

Follow Us