
నిమ్మరసం అనగానే కేవలం వేసవిలో దాహం తీర్చుకోవడానికి మాత్రమే తాగే పానీయమని చాలామంది భావిస్తారు. కానీ, రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి లభించే ఆరోగ్య ప్రయోజనాలు అపారమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిమ్మరసంలో పుష్కలంగా ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, డిటాక్స్ గుణాలు మన శరీరానికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. అందుకే… ప్రతీఒక్కరూ ఉదయాన్నే నిమ్మరసం తాగాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు.. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని ఉదయాన్నే తాగితే ఎన్నో సమస్యలను దూరం చేయొచ్చు.. ఒకవేళ ఉదయం తాగకపోయినా.. రోజులో ఎప్పుడైనా నిమ్మరసం తాగడం చాలా మంచిది.
నిమ్మకాయలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో అత్యంత కీలకమైన పోషకం. నిత్యం నిమ్మరసం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్‌ఫెక్షన్లతో పాటు సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
విటమిన్-సి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకర అల్ట్రావయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మంపై కలిగే దుష్ప్రభావాలు, టానింగ్, ఫోటోడెర్మటైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో నిమ్మరసం సాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధుమేహంతో బాధపడేవారికి నిమ్మరసం ఒక ఔషధంలా పనిచేస్తుంది. నిమ్మకాయలోని కరిగే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి, ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. డయాబెటిస్ వల్ల కలిగే రక్తనాళాల (వాస్కులర్) సంబంధిత సమస్యలను నివారించడంలో విటమిన్-సి కీలక పాత్ర పోషిస్తుంది.
నిమ్మరసంలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సహజ సిద్ధమైన డైయూరిటిక్ (మూత్రవిసర్జనను పెంచేది)లా పనిచేసి, అధిక రక్తపోటును (హై బీపీ) అదుపులో ఉంచుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా (అథెరోస్క్లెరోసిస్) కాపాడి, గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో పేగుల కదలికలు సరిగా లేకపోవడం వల్ల వచ్చే మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
అన్ని కాలాల్లోనూ నిమ్మరసాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఎన్నో తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.