Oats Dosa Recipe: నానబెట్టడం, పులియబెట్టడం అవసరం లేదు.. 20 నిమిషాల్లో కరకరలాడే దోసె ఓట్స్ దోశ!

ఉదయం అల్పాహారం కోసం దోసె తినాలనిపించినప్పుడు ముందురోజు బియ్యం నానబెట్టి, పిండి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ పని మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓట్స్‌తో చాలా సులభంగా, తక్కువ సమయంలోనే కరకరలాడే దోసెలను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా పిండిని రాత్రంతా నానబెట్టడం లేదా పులియబెట్టడం అవసరం లేదు.

Oats Dosa Recipe: నానబెట్టడం, పులియబెట్టడం అవసరం లేదు.. 20 నిమిషాల్లో కరకరలాడే దోసె ఓట్స్ దోశ!
Instant Oats Dosa Recipe

Updated on: Sep 30, 2026 | 5:01 PM

ఓట్స్‌తో పాటు బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కలిపి ఈ దోసె పిండిని సిద్ధం చేసుకోవచ్చు. పిండిని సుమారు 5 నిమిషాలు పక్కన పెట్టి, సరైన పల్చదనంతో పెనంపై వేస్తే బయటకు కరకరలాడేలా, రుచిగా ఓట్స్ దోసె తయారవుతుంది.

ఓట్స్ దోసెకు కావలసిన పదార్థాలు

ఓట్స్ – 1 కప్పు

బియ్యపు పిండి – అర కప్పు

బొంబాయి రవ్వ – పావు కప్పు

పెరుగు – 2 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయ – 1

పచ్చిమిర్చి – 1

జీలకర్ర – అర టీస్పూన్

కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్

నీరు – 2 నుంచి 2½ కప్పులు

ఉప్పు – రుచికి తగినంత

నూనె – అవసరమైనంత

కావాలనుకుంటే: తురిమిన క్యారెట్, కరివేపాకు లేదా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.

ఓట్స్ దోసె ఎలా తయారు చేయాలి?

ఓట్స్‌ను మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ పిండి అందుబాటులో ఉంటే దానినే నేరుగా ఉపయోగించుకోవచ్చు.

ఒక గిన్నెలో ఓట్స్ పిండి, బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, జీలకర్ర వేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి.

కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బాగా కలపాలి. దోసె పిండి సాధారణ దోసె పిండికంటే కొంచెం పల్చగా ఉండాలి. కలిపిన తర్వాత సుమారు 5 నిమిషాలు పక్కన పెట్టాలి.

ఓట్స్, బొంబాయి రవ్వ నీటిని పీల్చుకోవడం వల్ల 5 నిమిషాల తర్వాత పిండి కొంచెం చిక్కగా మారవచ్చు. దోసె వేయడానికి ముందు పిండిని మరోసారి బాగా కలిపి, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి.

నాన్‌స్టిక్ లేదా ఇనుప పెనాన్ని మధ్యస్థ మంటపై బాగా వేడి చేయాలి. తర్వాత కొద్దిగా నూనె రాయాలి.

సాధారణ దోసెలా పిండిని మధ్యలో వేసి బయటకు పరచకుండా, పెనం అంచుల నుంచి మధ్య వైపు పిండిని పోయాలి. దోసె పల్చగా ఉండేలా చూసుకోవాలి.

 

దోసె అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేయాలి. అడుగుభాగం బంగారు గోధుమ రంగులోకి మారి కరకరలాడే వరకు మధ్యస్థ మంటపై కాల్చాలి.

ఈ చిట్కాలు గుర్తుంచుకోండి

ఓట్స్, బొంబాయి రవ్వ నీటిని త్వరగా పీల్చుకుంటాయి. కాబట్టి దోసెలు వేస్తున్నప్పుడు పిండి చిక్కబడితే మధ్యమధ్యలో కొద్దిగా నీళ్లు కలుపుతూ ఉండాలి.

పెనం మరీ చల్లగా ఉంటే దోసె మెత్తగా లేదా జిగురుగా రావచ్చు. అదే సమయంలో పెనం మరీ వేడిగా ఉంటే పిండిని సరిగ్గా పరచడం కష్టమవుతుంది. అందుకే మధ్యస్థ మంటను కొనసాగించడం మంచిది.

ఇనుప పెనం ఉపయోగిస్తే ప్రతి దోసెకు ముందు నూనె రాసిన ఉల్లిపాయ ముక్కతో పెనాన్ని తేలికగా తుడవవచ్చు. దోసెను మరీ మందంగా వేయకుండా పల్చగా వేస్తేనే బాగా ఉడికి కరకరలాడుతుంది.

వేడి వేడి ఓట్స్ దోసెను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా మీకు నచ్చిన సాంబార్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us