నాటు కోడి అంటే చాలా మందికి ఇష్టం. నాటుకోడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిదే. నాటు కోడి పులుసు – రాగి ముద్ద, నాటుకోడి – చిల్లి గారె రెసిపీలు ఆంధ్రాలో చాలా ఫేమస్. నాటుకోడి కర్రీ వేరు.. నాటుకోడి పులుసు వేరుగా చేస్తారు. నాటు కోడి పులుసు.. రాయల సీమలో చాలా స్పెషల్. కాస్త మసాలాలు పెట్టి ఘాటుగా వండుతారు. సాధారణంగా నాటు కోడి కర్రీ వండుతూ ఉంటారు. కానీ రాయల సీమ స్టైల్‌లో చేస్తే మరింత రుచిగా ఉంటుంది. నాటుకోడి పులుసు మరి ఈ రాయల సీమ స్టైల్‌లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాటుకోడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, ఎండు మిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, అనాస పువ్వు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్.
ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి.. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, అనాస పువ్వు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి ఓ గిన్నెలోకి తీసుకోండి. ఈ దినుసులు చల్లారాక ఓ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అందులోనే వెల్లుల్లి, అల్లం వేయండి. అన్నింటిని మెత్తని పేస్టులా మిక్సీ పట్టండి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి.. ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు కలపాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన నాటుకోడి ముక్కలు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. ఆ నెక్ట్స్ మిక్సీ పట్టిన మసాలా.. ఓ మూడు లేదా నాలుగు స్పూన్లు.. మీ కూరను బట్టి వేసుకోండి.
స్పైసీగా కావాలి అంటే కాస్త ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు చికెన్‌లో నీరు బయటకు వచ్చి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు కొద్దిగా వేసి మరో రెండు నిమిషాలు వేయించి.. నీళ్లు పోసి.. కుక్కర్ మూత పెట్టి కనీసం 10 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. 10 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి.. వేడి తగ్గేంత వరకు చూడాలి. ముక్క ఉడికితే కొద్ది సేపు ఉడికించి కొత్తిమీర చల్లి.. కాస్త పులుసుగా ఉన్నప్పుడే కర్రీ దించేసుకోవాలి. కర్రీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసి.. ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు సిద్ధం.