గోంగూర, ఎగ్స్ రెండూ ఆరోగ్యానికి మంచిదే. గోంగూరతో వెజ్, మటన్, చికెన్, రొయ్యలు వంటి కాంబినేషన్స్ తినే ఉంటారు. కానీ గోంగూర ఎగ్ అనే కాంబినేషన్ చాలా మంది తిని ఉండరు. ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని ఎవరైనా శ్రమ లేకుండా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే అయిపోతుంది. వేడి వేడి అన్నంలో తింటే భలేగా ఉంటుంది. పులావ్‌లో చాలా రుచిగా ఉంటుంది. అలాగే చపాతీ, రోటీల్లోకి కూడా తినవచ్చు. మరి ఈ ఎగ్ గోంగూర కర్రీని ఎలా తయారు చేస్తారు. ఎగ్ గోంగూర కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర, ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆయిల్.
ముందుగా గోంగూర వలిచి శుభ్రంగా కడిగి.. వేయించి పక్కన పెట్టాలి. అలాగే గుడ్లను కూడా ఉడికించి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కర్రీ పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి రంగు మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఆ నెక్ట్స్ టమాటా ముక్కలు వేసి మెత్తపడేంత వరకు ఉడికించాలి.
ఇవి కూడా మెత్తగా అయ్యాక.. గోంగూర వేసి కలపాలి. ఓ ఐదు నిమిషాలు వేయించాక.. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఆ తర్వాత గుడ్లు కూడా వేసి.. నీళ్లు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ సిద్ధం.