చలి కాలంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. చలి జ్వరం, జలుబు, దగ్గు, చెవి పోటు, నోటి పూత, అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఎటాక్ చేస్తాయి. కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఆహారాలు తీసుకోవాలి. సూప్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బయట హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లే బదులు ఇంట్లో కూడా మనం ఆరోగ్యంగా సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఈజీగా చేసుకునే సూప్స్‌లో పెసర పప్పు సూప్ ఒకటి. చాలా తక్కువ టైమ్‌లో రుచిగా ఈ సూప్ చేసుకోవచ్చు. మరి ఈ పెసర పప్పు సూప్ ఎలా చేస్తారు? ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పెసర పప్పు, క్యారెట్ తరుగు, నీరు, ఉప్పు, నిమ్మరసం, మిరియాలు, నెయ్యి, బఠాణీలు.
ముందుగా పెసర పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ సన్నగా తరిగి పెట్టాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో పెసర పప్పు, క్యారెట్ ముక్కలు, కడిగిన పచ్చి బఠాణీలు వేసి మూత పెట్టి ఓ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత వేడి తగ్గిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొన్ని మిరియాలు కచ్చా పచ్చాగ దంచి వేయాలి.
ఆ తర్వాత పెసర పప్పు మిశ్రమాన్ని, పలుచగా ఉండేలా నీళ్లు వేసి మరిగించాలి. ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసి ఓ రెండు ఉడుకులు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని వేడి వేడిగా తాగితే చాలు. చివరగా పై నుంచి నిమ్మ రసం పిండి.. కొత్తిమీర చల్లితే చాలా బాగుంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు సూప్ సిద్ధం.