పూరీలు అంటే ఎంతో మంది ఇష్టంగా తింటారు. వేడి వేడి పూరీలు అలా వేస్తూ ఉంటే.. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు. బయట చేసే పూరీల కంటే ఇంట్లో చేసినవే ఆరోగ్యానికి కాస్త మంచిది. అక్కడ వాళ్లు ఎలాంటి ఆయిల్ వాడతారో కూడా తెలీదు. వేడి చేసిన ఆయిల్ మళ్లీ వేడి చేసి వాడతారు. కాస్త శ్రమిస్తే ఇంట్లో ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే వాటి కంటే ఒక్కోసారి కాస్త వెరైటీ టచ్ ఇవ్వాలి. అలా ఆలు గడ్డలతో కూడా కలిపి పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చెబుతుంటేనే నోట్లో నీళ్లూ ఊరుతున్నాయి. అయితే వీటికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సండే ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. మరి ఆలు గడ్డల పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన బంగాళ దుంపలు, గోధుమ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, ఆయిల్.
ముందుగా బంగాళ దుంపల్ని ఉడికించి తొక్క తీసి ఓ బౌల్ లోకి తీసుకోండి. దుంపల్ని బాగా మెదిపాలి. ఇందులో గోధుమ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి. ఆలు గడ్డల్లో ఉండే నీరే సరిపోతుంది. చూసుకుని జాగ్రత్తగా మిక్స్చేసుకోవాలి. లేదంటే పిండి జారుగా అయిపోతుంది. ఆ తర్వాత వీటిని పూరీల్లా వత్తుకుని.. ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ పూరీలు సిద్ధం. వీటిని నేరుగా వేడి వేడిగా ఉన్నప్పుడు తిన్నా టేస్టీగానే ఉంటాయి. లేదంటే పూరీ కర్రీ, ఇతర కర్రీలతో కూడా తినవచ్చు. చికెన్, మటన్, ఫిష్ పులుసుతో తింటే ఆహా వీటికి మరింత రుచి పెరుగుతుంది. మరి ఇంకెందుకు లేట్ ఎప్పుడైనా నాన్ వెజ్ వంటలు చేసుకున్నప్పుడు వీటిని కూడా ట్రై చేయండా. చాలా బాగుంటాయి.