ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో వేరుశనగలు ఉంటే ఇలా కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ కూడా. వేరు శనగల కర్రీ పూరీ, చపాతీలు, అన్నంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. అంతే కాకుండా ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. మరి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వేరు శనగ, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, వేరు శనగల పొడి, పెరుగు. బిర్యానీ దినుసులు, కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, ఎండు మిర్చి, గరం మసాలా, నెయ్యి, నూనె, మెంతులు.
ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఓ కప్పు వేరుశనగ తర్వాత ఉల్లిపాయలను, పచ్చి మిర్చి, బిర్యానీ దినుసులు వేసి ఓ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి. వేడి చల్లారాక అన్నీ ఒకసారి కచ్చా పచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి ఓ పది నిమిషాలు వేయించాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, పసుపు, గరం మసాలా, ఎండు మిర్చి వేసి కలపాలి. ఓ ఐదు నిమిషాలు ఉడికించా.. చిలికిన పెరుగు అరకప్పు వేసి మీడియం మంట మీద ఓ ఉడుకు తెప్పించాలి. ఇప్పుడు కసూరి మేతి పొడి చేసి వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా వేరు శనగ పొడిని కూడా వేసి అంతా కలిపేలా చేయాలి. ఇదంతా ఒక ఉడుకు రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వేరుశనగ కర్రీ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది.