Tea: వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..? ఇది చదివాక మీ అలవాటును మార్చుకుంటారు..

ఉదయం లేవగానే పొగలు కక్కే వేడివేడి టీ గొంతులోకి దిగుతుంటే అబ్బా అనుకునే టీ లవర్స్ మనలో చాలామందే ఉన్నారు. అయితే అలవాటే మిమ్మల్ని సైలెంట్‌గా మరణం వైపు నెడుతుందని మీకు తెలుసా? 60 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్న టీ లేదా కాఫీని రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

Tea: వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..? ఇది చదివాక మీ అలవాటును మార్చుకుంటారు..
Drinking Hot Tea Increases Cancer Risk

Updated on: Jun 07, 2026 | 12:00 PM

ఉదయం లేవగానే వేడివేడి టీ లేదా కాఫీ తాగడం చాలామందికి ఒక అలవాటు. మరీ ముఖ్యంగా పొగలు కక్కే టీ గొంతులోకి దిగుతుంటే వచ్చే మజానే వేరని భావిస్తారు. అయితే టీ ప్రియులకు శాస్త్రవేత్తలు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. మరీ అంత పగలు కక్కేలా.. అమితమైన వేడితో టీ తాగే అలవాటు ఉంటే ఎసోఫాగియల్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 90శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ ఫర్హాద్ ఇస్లామి నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న టీని ప్రతిరోజూ 700 మిల్లీలీటర్ల కంటే ఎక్కువగా తాగే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు 90 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధన కోసం ఈశాన్య ఇరాన్‌లోని గొలెస్తాన్ ప్రాంతానికి చెందిన 40 నుండి 75 ఏళ్ల వయస్సు గల దాదాపు 50,000 మందిని శాస్త్రవేత్తలు సుదీర్ఘ కాలం పాటు పరిశీలించారు. గతంలో కూడా వేడి టీకి, క్యాన్సర్‌కు లింక్ ఉందని పరిశోధనలు వచ్చినా.. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతను లెక్కిస్తూ నివేదిక ఇవ్వడం ఇదే మొదటిసారి.

గొంతు నరకం: ఏటా 4 లక్షల మంది మృతి..

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాలలో ఆహారవాహిక క్యాన్సర్ ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నిలిచింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం.. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం మింగే ఆహారం, ద్రవాలు నోటి నుండి జీర్ణాశయానికి చేరడానికి ఉపయోగపడే పొడవైన గొట్టాన్నే ఆహారవాహిక అంటారు. ధూమపానం, మద్యం, యాసిడ్ రిఫ్లక్స్, మితిమీరిన వేడి ద్రవాల వల్ల ఈ భాగం పదేపదే దెబ్బతినడం వల్లే ఈ క్యాన్సర్ వస్తుంది.

సమస్య టీలో లేదు.. ఉన్నదంతా ఆ వేడి లోనే..

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ స్టీఫెన్ ఎవాన్స్ ప్రకారం.. ఇక్కడ సమస్య మనం తాగే టీ లేదా కాఫీలో లేదు, మనం తాగే ఉష్ణోగ్రతలోనే ఉంది. మైక్రోవేవ్‌లో వేడి చేసిన జామ్ లేదా మరేదైనా పదార్థం అయినా సరే.. గొంతును కాల్చేంత వేడితో తీసుకుంటే ఆహారవాహిక లోపలి కణాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పదేపదే ఆ కణాలు గాయపడటం వల్ల కాలక్రమేణా అవి క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంది. లండన్ యూనివర్సిటీ కాలేజ్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ జేమ్స్ డాయిడ్జ్ మాట్లాడుతూ.. ‘‘శరీరంలోని ఏ భాగాన్నైనా పదేపదే ఇరిటేట్ చేస్తే అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎండ తీవ్రత వల్ల స్కిన్ క్యాన్సర్, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చినట్లే.. అమితమైన వేడి పదార్థాల వల్ల గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్లు వస్తాయి’’ అని స్పష్టం చేశారు.

ఎక్కడెక్కడ ఈ ప్రమాదం ఎక్కువ?

అమెరికా, యూరప్ దేశాలలో సాధారణంగా టీ లేదా కాఫీని 65 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ వేడిలోనే తాగుతారు. కానీ రష్యా, ఇరాన్, టర్కీ, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలలో నిరంతరం వేడి చేసే సమోవర్ పాత్రల నుండి నేరుగా మరుగుతున్న టీని తాగడం ఒక సంప్రదాయంగా వస్తోంది. మన దేశంలో కూడా చాలామంది రోడ్డు పక్కన బండ్ల మీద మరుగుతున్న టీని అలాగే వేడిగా తాగేస్తుంటారు.

Follow Us