
కీర దోసకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారం అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కీర దోసకాయలో నీరు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లతోపాటు.. విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. కీర దోసకాయ ప్రయోజనాలను, దానిని ఎలా వినియోగించాలో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..
కీరదోసకాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ అనే రెండు ముఖ్యమైన సమ్మేళనాలు మధుమేహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు జీర్ణం అయిన తర్వాత గ్లూకోజ్‌గా మారతాయి. ఈ గ్లూకోజ్ ప్రేగుల నుండి రక్తంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా, ఈ గ్లూకోజ్ రక్తంలోకి వేగంగా, అధిక మొత్తంలో చేరితే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే, కీరా దోసకాయలోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ ఈ ప్రక్రియను నియంత్రిస్తాయి. ఇవి ప్రేగుల నుండి చక్కెర రక్తంలోకి తక్కువగా, నెమ్మదిగా శోషణ అయ్యేలా చేస్తాయి. హై షుగర్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మధుమేహం అదుపు తప్పిన వారిలో, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారిలో తరచుగా బీటా కణాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది లేదా ఇన్సులిన్ సరిగ్గా పని చేయదు. కీరా దోసకాయ ఈ బీటా కణాలపై ఒత్తిడిని తగ్గించి, ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
కీరా దోసకాయ ప్రయోజనాలను పొందడానికి దీనిని రోజువారీ ఆహారంలో వివిధ రకాలుగా చేర్చుకోవచ్చు:
ఉదయం అల్పాహారంలో: మొలకలు, పండ్లు తినేటప్పుడు కీరా దోసకాయను తొక్క తీయకుండా అరడజను నుంచి పది చక్రాలు లేదా 15 చక్రాలు పెట్టుకుని తినండి.
మధ్యాహ్న భోజనంలో: కూరలు, పుల్కాతో పాటు పది, పదిహేను కీరా దోసకాయ చక్రాలను నంజుకుంటూ తినండి.
పెరుగు చట్నీ: కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, టమోటా ముక్కలు కలిపి పెరుగుతో చట్నీ చేసుకోవచ్చు. ఇది భోజనానికి చాలా రుచికరమైన అదనంగా ఉంటుంది.
వెజిటబుల్ జ్యూస్‌లో: డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూస్‌లకు బదులుగా వెజిటబుల్ జ్యూస్‌లో కీరా దోసకాయను కాయ కాయగా కలిపి తాగవచ్చు.
సలాడ్స్‌లో: సాయంకాలం సలాడ్స్ తినేటప్పుడు కీరా దోసకాయ ముక్కలను చేర్చుకోవడం ఆరోగ్యకరం.
కీరా దోసకాయలో జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 100 గ్రాముల కీరా దోసకాయలో కేవలం 10-12 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో 96-97% వరకు నీరు ఉంటుంది. తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం కారణంగా, కీరా దోసకాయ బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది చాలా రుచికరంగా, సహజంగా తినడానికి బాగుంటుంది. ఇలా కీర దోసకాయలను ఉపయోగించడం ద్వారా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.