
నీరు ప్రాణాధారం. ప్రతిరోజూ మనం తాగే నీరు స్వచ్ఛంగా, పారదర్శకంగా కనిపిస్తే సరిపోతుందని అనుకుంటాం. కానీ నీరు చూడటానికి శుభ్రంగా ఉన్నంత మాత్రాన అందులో హానికరమైన రసాయనాలు లేవని చెప్పలేం. ఎలాంటి వాసన, రుచి లేకపోయినా కొన్ని రసాయన కాలుష్యాలు నీటిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్సెనిక్, క్లోరినేషన్ సమయంలో ఏర్పడే ఉప ఉత్పత్తులు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి వచ్చే కాలుష్యాలు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కొన్ని రసాయనాలు క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటీవల బాటిల్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి సంబంధించిన రసాయనాల వివాదం నేపథ్యంలో.. మనం తాగే నీరు నిజంగానే క్యాన్సర్‌కు కారణమవుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
కొన్ని రసాయనాలు కలుషితమైన తాగునీటిలో చేరి, దీర్ఘకాలం శరీరంలోకి వెళ్లడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నీటిలో క్యాన్సర్ కారక పదార్థం ఉన్నంత మాత్రాన దాన్ని తాగిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని అర్థం కాదు. ఎంత పరిమాణంలో ఆ రసాయనం శరీరంలోకి చేరింది? ఎన్ని సంవత్సరాల పాటు ఆ నీటిని తాగారు? వ్యక్తి వయసు, జన్యుపరమైన అంశాలు, ధూమపానం, ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలు క్యాన్సర్ ముప్పును ప్రభావితం చేస్తాయి. ఒక్కసారి కలుషిత నీటిని తాగడం కంటే, అధిక స్థాయిలో ఉన్న రసాయనాలను సంవత్సరాల తరబడి తీసుకోవడం ఎక్కువ ప్రమాదకరం.
2019లో అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ (EWG) నిర్వహించిన ఓ విశ్లేషణలో 48,363 కమ్యూనిటీ వాటర్ సిస్టమ్‌లలోని 22 రకాల క్యాన్సర్ కారక పదార్థాలను పరిశీలించారు. ఈ రసాయనాల సమిష్టి ప్రభావం వల్ల జీవితకాలంలో సుమారు లక్ష క్యాన్సర్ కేసులు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి 10 వేల మందిలో దాదాపు నలుగురికి అదనపు క్యాన్సర్ ముప్పు ఉండవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఇందులో ఆర్సెనిక్, నీటిని శుద్ధి చేసే సమయంలో ఏర్పడే ఉప ఉత్పత్తుల వాటా ఎక్కువగా ఉంది. అయితే ఇవి గణాంక నమూనాల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. వాస్తవంగా నమోదైన క్యాన్సర్ కేసుల సంఖ్య కాదు. అందువల్ల భయపడాల్సిన అవసరం లేకపోయినా, తాగునీటి నాణ్యతపై శ్రద్ధ పెట్టడం అవసరం.
ఆర్సెనిక్ అనేది సహజంగా భూగర్భ జలాల్లో ఉండే ఒక రసాయన మూలకం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల్లో ఇది కనిపిస్తుంది. ఆర్సెనిక్ కలిగిన నీటిని దీర్ఘకాలం తాగడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని పరిశోధనలు వెల్లడించాయి. మూత్రపిండాలు, కాలేయ క్యాన్సర్లతోనూ సంబంధం ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాగునీటిలో ఆర్సెనిక్ పరిమితిని లీటరుకు 10 మైక్రోగ్రాములుగా నిర్దేశించింది. అరచేతులు, అరికాళ్లపై చర్మం మందంగా మారడం, మచ్చలు ఏర్పడటం వంటివి దీర్ఘకాలిక ఆర్సెనిక్ ప్రభావానికి సంకేతాలు కావచ్చు.
నీటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను చంపేందుకు క్లోరిన్ ఉపయోగిస్తారు. కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నీటిలోని సేంద్రియ పదార్థాలతో క్లోరిన్ చర్య జరిపినప్పుడు ట్రైహాలోమీథేన్స్ (THMs) వంటి రసాయనాలు ఏర్పడవచ్చు. 2025లో ప్రచురితమైన 29 పరిశోధనల సమీక్ష, మెటా అనాలిసిస్ ప్రకారం.. తక్కువ స్థాయిలో ఈ రసాయనాలకు గురైన వారితో పోలిస్తే అధిక స్థాయిలో గురైన వారిలో మూత్రాశయ క్యాన్సర్ ముప్పు 33 శాతం, కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పు 15 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే క్లోరినేషన్‌ను పూర్తిగా వ్యతిరేకించకూడదు. నీటి ద్వారా వ్యాపించే అంటువ్యాధులను అరికట్టడానికి క్లోరిన్ అవసరం. దాని ఉప ఉత్పత్తులు నిర్దేశిత భద్రతా పరిమితుల్లో ఉండేలా చూసుకోవడమే ముఖ్యం.
వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు, మురుగునీరు వంటి వాటి ద్వారా నైట్రేట్లు భూగర్భ జలాల్లోకి చేరవచ్చు. శరీరంలో ఇవి కొన్ని పరిస్థితుల్లో ఎన్-నైట్రోసో సమ్మేళనాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇవి జంతువుల్లో క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు గుర్తించారు. పెద్దపేగు, కడుపు, మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లతో సంబంధం ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ, దీనిపై పరిశోధనల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పీఎఫ్ఏఎస్ రసాయనాలను ‘ఫరెవర్ కెమికల్స్’ అని పిలుస్తారు. ఇవి పర్యావరణంలో సులభంగా విచ్ఛిన్నం కావు. వీటిలోని PFOAను క్యాన్సర్ కారకంగా, PFOSను క్యాన్సర్‌కు కారణం కావచ్చని భావించే పదార్థంగా అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (IARC) వర్గీకరించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధనలో నీటిలో పీఎఫ్ఏఎస్ స్థాయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని రకాల క్యాన్సర్ల రేట్లు 33 శాతం వరకు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది ప్రాంతాల వారీగా చేసిన పరిశీలన మాత్రమే. దీనివల్ల పీఎఫ్ఏఎస్ నేరుగా క్యాన్సర్‌కు కారణమని నిర్ధారించలేం.
యురేనియం, రేడియం వంటి రేడియోధార్మిక మూలకాలు కొన్ని ప్రాంతాల్లోని రాళ్ల నుంచి భూగర్భ జలాల్లోకి చేరవచ్చు. వీటిని అధిక స్థాయిలో, దీర్ఘకాలం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉంది.
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఇటీవల బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఓ ప్యాకేజ్డ్ వాటర్ నమూనాకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సదరు నీటి నమూనాలో తొలుత అనుమతించిన పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. అనంతరం రిఫరల్ ల్యాబొరేటరీ పరీక్షల్లో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. బ్రోమేట్‌ను మానవులకు క్యాన్సర్ ముప్పు కలిగించవచ్చని భావించే పదార్థంగా వర్గీకరించారు. PAHsలోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఈ వ్యవహారం ఒక ప్లాంట్‌లోని ఒక బ్యాచ్‌కు సంబంధించినదని కంపెనీ పేర్కొంటూ, పరీక్షల ఫలితాల్లోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఒక్క ఘటన ఆధారంగా బిస్లరీ బ్రాండ్‌కు చెందిన అన్ని బాటిళ్లు ప్రమాదకరమని చెప్పలేం. అలాగే ఒక్కసారి కలుషిత నీరు తాగినంత మాత్రాన క్యాన్సర్ వస్తుందని భావించకూడదు. ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. నీరు ఎంత పారదర్శకంగా కనిపించినా అందులోని రసాయనాలను కళ్లతో గుర్తించడం సాధ్యం కాదు. అందుకే నాణ్యతా పరీక్షలు, పారదర్శకత చాలా ముఖ్యం.
చాలామంది కుళాయి నీటి కంటే బాటిల్ వాటరే సురక్షితమని భావిస్తారు. కానీ అది ఎప్పుడూ నిజం కాదు. బాటిల్ వాటర్ నాణ్యత కూడా తయారీ విధానం, శుద్ధి ప్రక్రియ, నిల్వ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లను ఎండలో లేదా అధిక వేడి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉంచితే వాటి నుంచి కొన్ని రసాయనాలు నీటిలోకి చేరే అవకాశం ఉంటుంది.
ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ అనే అతి సూక్ష్మ కణాలు నీటిలోకి చేరవచ్చు. ముఖ్యంగా అధిక వేడి, సూర్యరశ్మి ప్రభావం వల్ల ఈ అవకాశం పెరగవచ్చు. ఈ కణాలు శరీరంలో వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి సమస్యలకు కారణమవుతాయా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే మానవుల్లో ఇవి నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతాయని నిర్ధారించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. దీర్ఘకాలిక ప్రభావాలపై మరిన్ని అధ్యయనాలు అవసరం.
మూత్రంలో రక్తం కనిపించడం, అరచేతులు లేదా అరికాళ్లపై చర్మం మందంగా మారడం లేదా నల్లటి మచ్చలు ఏర్పడటం, కారణం తెలియకుండా బరువు తగ్గడం, మలవిసర్జన అలవాట్లలో దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు కనిపించాయంటే క్యాన్సర్ ఉన్నట్లు కాదు. అయితే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. క్యాన్సర్ విషయంలో ముందస్తు గుర్తింపు చాలా కీలకం. మనం తాగే నీటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉండే అవకాశం అనేది నిర్లక్ష్యం చేయదగిన విషయం కాదు. అదే సమయంలో అనవసరంగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా ప్రమాదం అనేది రసాయనం ఏ స్థాయిలో ఉంది, ఎంతకాలం దానికి గురవుతున్నాం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు తాగే నీటి మూలాన్ని తెలుసుకోండి. అవసరమైన పరీక్షలు చేయించుకోండి. సమస్యకు అనుగుణంగా సరైన ఫిల్టర్ ఉపయోగించండి. నీటి నాణ్యతపై అవగాహన పెంచుకుంటే అనేక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సచిన్ మార్డా తెలిపారు.