
కుక్కర్‌ను పూర్తిగా నింపవద్దు: వంటింట్లో ప్రెషర్ కుక్కర్ వాడకం అనేది సమయాన్ని, గ్యాస్‌ను ఆదా చేసే గొప్ప పద్ధతి. అయితే, దీనిని అజాగ్రత్తగా వాడితే అది ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. చాలామంది త్వరగా వంట అయిపోవాలని కుకర్ నిండా ఆహార పదార్థాలను వేస్తుంటారు. కానీ, కుక్కర్ సామర్థ్యంలో 2/3 వంతుకు మించి ఎప్పుడూ నింపకూడదు. ముఖ్యంగా పప్పులు, బియ్యం వంటివి ఉడికేటప్పుడు పొంగుతాయి. కాబట్టి, వాటిని సగం వరకు మాత్రమే నింపడం సురక్షితం.

గ్యాస్కెట్ (రబ్బరు) నాణ్యత: కుక్కర్ మూతకు ఉండే రబ్బరు వదులుగా ఉన్నా లేదా పగుళ్లు ఉన్నా వెంటనే మార్చాలి. సరిగ్గా లేని గ్యాస్కెట్ వల్ల ఆవిరి పక్కల నుండి లీక్ అయ్యి లోపల తగినంత ఒత్తిడి ఏర్పడదు లేదా ప్రమాదకరంగా మారుతుంది.

నీటి పరిమాణం: కుక్కర్‌లో తగినంత నీరు లేకుండా వంట చేయడం చాలా ప్రమాదకరం. నీరు లేకపోతే కుకర్ అడుగుభాగం అతిగా వేడెక్కి సేఫ్టీ వాల్వ్ పేలిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి వండే పదార్థాన్ని బట్టి సరైన మోతాదులో నీటిని పోయాలి.

వెంట్ పైపు శుభ్రత: ప్రెషర్ కుక్కర్ మూతపై ఉండే వెంట్ పైపు (విజిల్ కింద ఉండే రంధ్రం) ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అందులో ఆహార కణాలు ఇరుక్కుపోతే లోపల ఏర్పడిన ఆవిరి బయటకు వెళ్లదు. దీనివల్ల లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది.

బలవంతంగా మూత తీయకండి: అలాగే, కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గకముందే మూతను బలవంతంగా తీయడానికి ప్రయత్నించకూడదు. వంట పూర్తయిన వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకూడదు. విజిల్ తీసివేసినా లోపల ఇంకా ఆవిరి మిగిలి ఉండవచ్చు. ప్రెషర్ పూర్తిగా తగ్గినట్లు నిర్ధారించుకున్న తర్వాతే మూత తీయాలి. ఈ ఐదు జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వంట గదిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ కుక్కర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండండి.