Tata Consultancy Services: పెరిగిన టీసీఎస్ సంపద… మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల

| Edited By:

Jan 09, 2021 | 9:30 PM

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. తొమ్మిదేళ్లలో...

Tata Consultancy Services: పెరిగిన టీసీఎస్ సంపద... మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల
TCS
Follow us on

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. తొమ్మిదేళ్లలో ఇవే అత్యుత్తుమ క్యూ3 ఫలితాలని టీసీఎస్ సైతం ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన ఆధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. కాగా, టీసీఎస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 7 శాతం వృద్ధితో రూ.8,701 కోట్లకు పెరిగింది. దీంతో టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డ్‌ డేట్‌ ఈ నెల 16. వచ్చే నెల 3న చెల్లింపులు జరుగుతాయని తెలిపింది. కాగా, గత ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.65,000 కోట్ల నగదు నిల్వలున్నాయి.

వర్క్ ఫ్రం హోమ్…

టీసీఎస్ లోని అన్ని విభాగాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి. రామకృష్ణన్‌ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 15,721 మందికి ఉద్యోగాలిచ్చామని, గత ఏడాది డిసెంబర్‌ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.69 లక్షలకు పెరిగిందన్నారు. ఆట్రిషన్‌ రేటు(ఉద్యోగుల వలస) జీవిత కాల కనిష్ట స్థాయి….7.6 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం 3.4 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత, రెండు నెలల తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయమై సమీక్ష జరుపుతారు. కాగా, ఇంట్రాడేలో రూ.3,128 వద్ద ఆల్‌టైమ్‌ హైను తాకిన ఈ షేర్‌ చివరకు 3 శాతం లాభంతో రూ.3,120 వద్ద ముగిసింది. గత ఏడాది ఈ షేర్‌ 32 శాతం లాభపడింది.