తెలంగాణలో బీజేపీకి తమిళసై నియామకం కొత్త బలాన్నిస్తుందా?

తెలంగాణలో బీజేపీకి తమిళసై నియామకం  కొత్త బలాన్నిస్తుందా?

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్‌ రాకతో రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుందా? బీజేపీని తెలంగాణలో పటిష్ట పరచడం కోసమే కేంద్రం తమిళసైని గవర్నర్‌గా నియమించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దాదాపు పదేళ్లపాటు గవర్నర్‌గా సేవలందించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటినుంచి ఈ నాటివరకు ఆయన నలుగురు ముఖ్యమంత్రుల్ని చూశారు. ఆయన తెలుగురాష్ట్రాల అభివృద్ధికోసం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 02, 2019 | 5:22 PM

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్‌ రాకతో రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుందా? బీజేపీని తెలంగాణలో పటిష్ట పరచడం కోసమే కేంద్రం తమిళసైని గవర్నర్‌గా నియమించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు రాజకీయ పండితులు.

ప్రస్తుత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దాదాపు పదేళ్లపాటు గవర్నర్‌గా సేవలందించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటినుంచి ఈ నాటివరకు ఆయన నలుగురు ముఖ్యమంత్రుల్ని చూశారు. ఆయన తెలుగురాష్ట్రాల అభివృద్ధికోసం తనవంత కృషి చేశారు. నరసింహన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంతగా సఖ్యతగా లేరనే వాదన కూడా ఉంది. దీనికి కారణం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే. ఆ తర్వాత ఏపీకి వెళ్లిపోవడం ఒక కారణం. అదే విధంగా ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పట్లో దూకుడుగా వెళ్లడం, నరసింహన్‌కు సీఎం కేసీఆర్ దగ్గరగా మెలగడం కూడా చంద్రబాబు దూరం కావడానికి ఒక కారణం.

లెక్కకు మించిన సందర్భాల్లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో చాల దగ్గరగా ఉన్నారు. ప్రధాన సమస్యలపై ఆయనతో చర్చించి ఆయన ఆమోదం పొందడం కేసీఆర్‌కు ప్లస్‌ అయ్యింది. గత యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా గవర్నర్‌గా నరసింహన్‌ నియమితులైనప్పటికీ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌కు దగ్గయ్యారు.

ఇవన్నీ ఇలాఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన అనేక పోరాటాలు, ఆందోళనల సమయంలో గవర్నర్ నరసింహన్ కనీసం స్పందించలేదనేది బీజేపీ రాష్ట్ర నాయకులు వాదన. ఒకానొక సమయంలో నరసింహన్‌ టీఆర్ఎస్ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు బీజేపీ నేతలు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవడం అనేది గతంలో పెద్ద సమస్యగా తయారైంది. అయితే ఇటీవల కాలంలో టీఆర్ఎస్‌కు రానున్న కాలంలో మేమే ప్రత్యామ్నాయం అనే స్ధాయికి చేరుకున్నారు. ఇప్పటికే నాలుగు ఎంపీ స్ధానాలు కలిగి ఉన్న బీజేపీ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉండటంతో ఆ ఖాళీని బీజేపీ పూడ్చే పనిలో పడింది. గత నెలలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అనుకున్న లక్ష్యం కంటే అధికంగా పార్టీలో చేరికలు ఉండటంతో పార్టీకి సమీప భవిష్యత్తు బంగారు మయంగానే కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో తెలంగాణలో బీజేపీని మరింత బలంగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతివిషయాన్ని చాల జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి. కిషన్‌రెడ్డిని నియమించడం కూడా పార్టీ పటిష్టతకు, బలాన్ని పెంచడంలో భాగంగానే విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టేందుకే హోం శాఖలో కిషన్‌రెడ్డికి చోటు కేటాయించినట్టు చెబుతున్నారు.

తాజాగా తెలంగాణలో దూకుడుగా వ్యవహరించేందుకు కొత్త గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ను నియమించడం పక్కా ప్రణాళికాబద్దమే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇప్పటివరకు ఉన్న నరసింహన్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా మారిపోయారనే ఆరోపణలతో ఆయనను తప్పించి ఈమెకు గవర్నర్ పదవిని కట్టబెట్టారని సమాచారం. 2022 నాటికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ బలంగా భావిస్తోంది. అందులో భాగంగానే ఇక్కడి స్థానిక నేతలకు రాజ్యాంగ బద్దమైన పెద్ద పదవులు కట్టబెట్టడం. ఇప్పటికే మహారాష్ట్రకు సీహెచ్ విద్యాసాగర్‌రావును గవర్నర్‌గా చేసింది. ప్రస్తుతం ఆయనను కూడా తప్పించింది. తెలంగాణలో పార్టీని బలపరిచే విధంగా విద్యాసాగర్‌రావు సేవల్ని కూడా పార్టీ వినియోగించుకోనుంది. ఇక కొత్తగా నియమితులైన తమిళసై కూడా బీజేపీ బలోపేతానికి సహకరించే అవకాశాలు బలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనేపథ్యంలోనే పార్టీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి కొత్త గవర్నర్ తెలంగాణలో పార్టీకి ఏ మేరకు సహకరిస్తారో అనే విషయం భవిష్యత్తులో తేలనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu