
బిహార్ రాష్ట్రంలో ఓ బాలుడు దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కాడు. విచారణలో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఇక ఆ బాలుడు ఊచలు లెక్కబెట్టక తప్పదు అని అందరూ భావించారు. కానీ, జడ్జి తీర్పు విని అందరూ ఆశ్చర్యపోయారు. శిక్ష వేయాల్సిన జడ్జి… దోషికి బట్టలు, సరకులు కొనిచ్చి ఇంటికి పంపారు. ఇంతకీ ఆయన అలా ఎందుకు చేశారనుకుంటున్నారా?..అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
చట్టానికి కళ్లు ఉండవన్నది అందరికీ తెలిసిన నిజమే. కానీ, న్యాయమూర్తులకు మనసు ఉంటుంది. అందుకే, తల్లి ఆకలి తీర్చేందుకు, ఆమెకు వైద్యం చేయించేందుకు దొంగగా మారిన ఓ బాలుడికి శిక్ష వేయకుండా సాయం చేశారు బిహార్‌కు చెందిన ఓ జడ్జి. నలందలో దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ మైనర్ బాలుడు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ముందు తప్పు ఒప్పుకున్నాడు అతడు. దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకున్నాడు.
బాలుడి చెప్పిన మాటలు విన్న స్థానిక కోర్టు జడ్జి చలించిపోయారు. చెమర్చిన కళ్లతో..ద్రవిస్తోన్న మనసుతో..చట్ట ప్రకారం శిక్ష వేయకుండా…మానవత్వంతో శిక్షించకుండా కరుణించారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప… నివాసం ఉండటానికి ఇల్లు కూడా లేని ఆ బాలుడి కుటుంబానికి సరుకులు, బట్టలు అందించి ఆదుకున్నారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఆ బాలుడు మంచి మార్గంలో నడిచేందుకు ఉపయోగపడుతుందన్నారు.