‘అయోధ్య రాముడు మన రాముడు కాదా’.. తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసిన విరాళాల సేకరణ

అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీస్తుంది. రామమందిర నిర్మాణం కోసం విరాళాల కోసం

  • K Sammaiah
  • Publish Date - 11:12 am, Fri, 22 January 21
'అయోధ్య రాముడు మన రాముడు కాదా'.. తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసిన విరాళాల సేకరణ

అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీస్తుంది. రామమందిర నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణానికి విరాళాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన విధంగా వారు చేసుకుపోతున్నారు. మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కామెంట్స్‌ అలజడి రేపాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. దీంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఆత్మరక్షణలో పడింది. మరోవైపు రామమందిరం నిర్మాణానికి మద్దతుగా ఆందోల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌. తనే స్వయంగా విరాళాల సేకరించారు.

రామమందిర నిర్మాణానికి విరాళాల కోసం బీజేపీ నేతలు చేస్తున్న ఇంటింటి యాత్రపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. యూపీలో ఉన్న రాముడు మనకెందుకు.. ? మన ఊరిలోనే మనకు రాముడు ఉన్నాడంటూ కామెంట్‌ చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కామెంట్స్‌పై కమలనాథులు మండిపడ్డారు. ఎవరి దగ్గర నుంచీ బలవంతంగా డబ్బులు తీసుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. అసలు టీఆర్‌ఎస్‌ స్టాండ్‌ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ వైఖరి స్పష్టం చేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. విద్యాసాగర్‌రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ప్రజలే తిరగబడతారని బండి సంజయ్‌ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, క్రాంతికిరణ్‌ ఇద్దరిదీ ఒకటే పార్టీ… ఒకరు నై అంటుంటే… మరొకరు సై అంటున్నారు. సెంటిమెంట్‌తో ముడిపడ్డ సున్నిత అంశంపై పార్టీలో భిన్నస్వరాలు టీఆర్‌ఎస్‌కి ఇబ్బందికరంగా మారాయి. విరాళాల సేకరణతో జనంలోకెళ్తున్న కమలంపార్టీకి…అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ఇప్పుడు మరో ఇష్యూ దొరికినట్లయింది. మొత్తానికి అయోధ్య రామమందిరానికి విరాళా సేకరణ తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసింది.