ప్రశాంతతకోసమో, పుణ్యంకోసమో వెళ్లినవారు అక్కడే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకరి నిర్లక్ష్యానికో కొందరి తొందరపాటుకో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఏడుకొండలపై ఎప్పుడూ జరగలేదు ఇలాంటి ఘటన. ఒక్కసారిగా తొక్కిసలాట. అందరినీ అదుపుచేసేసరికే పెనువిషాదం జరిగిపోయింది. ఇంత ఘోరం ఎలా జరిగింది? ఈ నిర్లక్ష్యానికి కారకులెవరు? అనుకోకుండా జరిగిన విషాదమా? ఏదన్నా కుట్ర ఉందా? తిరుపతి తొక్కిసలాటపై పోస్ట్‌మార్టం మొదలైంది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇంతటి విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎన్ని గంటలపాటైనా క్యూలైన్లలో నిలుచుని వెంకన్న దర్శనం చేసుకుంటారు భక్తులు. దశాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో రద్దీ మామూలే. చిన్నచిన్న అసౌకర్యాలు, అప్పుడప్పుడూ భక్తుల ఫిర్యాదులే తప్ప, టెంపుల్ సిటీలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. సడెన్‌గా గేటు తెరవడమే తోపులాటకు కారణమంటున్నా.. అధికార యంత్రాంగం వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం(జనవరి 8) రాత్రి 8:20 నిమిషాల ప్రాంతంలో క్యూలైన్‌లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న మహిళను బయటికి రప్పించే క్రమంలోనే తొక్కిసలాట జరిగిందంటున్నారు స్థానిక అధికారులు.
వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా… బైరాగిపట్టెడ దగ్గర జరిగిందీ దారుణం. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. కేంద్రాల బయట నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి.
బైరాగిపట్టెడ దగ్గర తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం పదింటికే అక్కడికి చేరుకున్నారు. రాత్రికల్లా పరిసరాలన్నీ కిక్కిరిశాయి. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు నిస్సహాయంగా చిక్కుకుపోయారు. క్యూలైన్లలోకి వెళ్లేందుకు జరిగిన తోపులాటలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులను స్విమ్స్, రుయా ఆస్పత్రులకు తరలించారు. తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగిపట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బాధ్యత తీసుకున్నవారు విధుల్ని సజావుగా నిర్వర్తించాలని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర అధికారులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. 2 వేల మందికే చోటు ఉన్నప్పుడు.. 2,500 మందిని ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్‌ఇకి జాగ్రత్తలు చెప్పారా అని ప్రశ్నించారు. తమాషా అనుకోవద్దంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ముమండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. తోపులాటకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. చికిత్స పొందుతున్న భక్తులందరికీ వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామని ఓదార్చారు. భక్తులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఓ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. తొక్కిసలాట ఘటనతో పాటు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.
తిరుపతి, తిరుమలలో అన్ని కౌంటర్ల దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామంటోంది అధికార యంత్రాంగం. గేటు తెరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు దారి తీసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం ఓ తప్పయితే.. డీఎస్పీ గేటు తీయడంతో అంతా ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారన్న వాదన వినిపిస్తోంది. కొందరు భక్తుల అత్యుత్సాహం తొక్కిసలాటకు దారితీసింది. కౌంటర్ దగ్గర గేట్ తెరిచే విషయంలో మిస్ కమ్యూనికేషన్ ఏర్పడిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. భక్తుల్లో అనారోగ్యానికి గురైన ఒకరిని ఆసుపత్రికి తరలించడానికి గేట్ తెరవాల్సి వచ్చిందని, మళ్లీ వెంటనే మూసేసినా ఆలోపే టోకెన్లు జారీ చేస్తున్నారని భావించి భక్తులు దూసుకొచ్చారని చెప్పారు. దీంతో అనివార్యంగా గేట్ తెరవాల్సి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5లక్షలు, స్వల్పగాయాలైనవారికి రూ. లక్షచొప్పున చంద్రబాబు సహాయం ప్రకటించారు. మరోవైపు, తొక్కిసలాట ఘటనలో సర్కారు యాక్షన్ మొదలైంది. ఘటనా స్థలంలో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ రమణకుమార్‌పై వేటుపడింది. తిరుపతి తొక్కిసలాటను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవటంతో మరికొందరిపై చర్యలు తప్పవంటున్నారు. ముఖ్యమంత్రికంటే ముందు తిరుపతికి చేరుకున్న మంత్రుల బృందం రుయాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బాధితుల్ని పరామర్శించారు. ఇది ప్రమాదమా.. లేక కుట్రకోణమా అనేదానిపై విచారణ జరుగుతుందని మంత్రులు తెలిపారు. క్యూ లైన్లలోకి అంత అనాలోచితంగా ఒకేసారి ఎలా వదిలారు? సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా ఇదే విషయంపై సీరియస్ అయ్యారు. తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌ని పవన్‌కల్యాణ్ పరిశీలించారు. భక్తులను క్యూలైన్లలోకి ఒకేసారి ఎందుకు వదిలారని ప్రశ్నించారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించారు.
తొక్కిసలాట ఘటనపై పోస్టుమార్టం జరుగుతుంటే.. ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటోంది ప్రతిపక్ష వైసీపీ. సరైన భద్రతా ఏర్పాట్లు చేసుంటే భక్తుల ప్రాణాలు పోయుండేవి కావంటున్నారు విపక్ష నేతలు. గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విషాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని, సీఎం, టీటీడీ ఛైర్మన్ సహా అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది విపక్షపార్టీ. తిరుమల ప్రసాదాన్ని కూడా రాజకీయం చేయాలని చూసిన ప్రభుత్వం తొక్కిసలాట ఘటనకు ఏం సమాధానం చెబుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిలదీశారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి ఘటనకు చంద్రబాబుదే పూర్తి బాధ్యత అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు.
ఇదిలావుంటే, భక్తుల రద్దీని అధికారులు అంచనా వేయలేకపోయారా? తోపులాట ప్రాణాలు తీసేదాకా వస్తుందని ఊహించలేకపోయారా? ఆరుగురు మరణానికి, 41మంది ఆస్పత్రి పాలుకావడానికి కారణమేంటన్న పోస్టుమార్టం మొదలైంది. సీఎం చంద్రబాబుకు ఇప్పటికే ప్రాథమిక నివేదిక వెళ్లింది. ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులను మొహంమీదే కడిగేసిన సీఎం.. చర్యలు ప్రారంభించారు. సమీక్షా సమావేశంలోనూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి డీఎస్పీతో పాటు గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై జుడీషియల్ విచారణకు ఆదేశించిన సీఎం.. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయని ప్రకటించారు. తిరుపతిలో దర్శనం టికెట్లు ఇవ్వడం గతంలోలేని సంప్రదాయమన్న చంద్రబాబు.. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని అభిప్రాయపడ్డారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావటంతో తిరుపతి తొక్కిసలాట ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. దేశంలో ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో గతంలోనూ ఎన్నో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. వదంతులు, భయాలు, కొందరి తొందరపాటు చర్యలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. పోయినేడాది జూలై 2న ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారీ జనసందోహంతో జరిగిన భోలే బాబా సత్సంగ్‌లో జరిగిందీ దారుణం. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, పిల్లలే. ఈ తొక్కిసలాటలో 300 మందికి పైనే గాయపడ్డారు.
ఏళ్లు గడిచినా మరిచిపోలేని విషాదాలు దశాబ్దాలుగా చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి. 2005 జనవరి 25 మహారాష్ట్ర సతారా మంధర్‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 350మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టెంకాయలు కొట్టిన మెట్లపై కొందరు భక్తులు జారిపడటంతో మొదలైన తొక్కిసలాట తీవ్ర విషాదానికి దారితీసింది. 2008 సెప్టెంబరు 30న రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ చాముండేశ్వరిదేవి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 224 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. బాంబు ఉందనే వదంతి ఈ విషాదానికి కారణమైంది. అదే ఏడాది హిమాచల్‌ప్రదేశ్ నైనాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట 162 నిండుప్రాణాలను బలి తీసుకుంది. కొండచరియలు విరిగిపడుతున్నాయనే ప్రచారంతో భయాందోళనకు గురికావటంతో జరిగిందీ దారుణం.
మధ్యప్రదేశ్ రతన్‌ఘడ్ మాత ఆలయ సమీపంలో జరిగిన తొక్కిసలాట మరో ఘోర విషాదం. 2013 అక్టోబరు 13న నవరాత్రి ఉత్సవాలలో జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. సింధ్ నదిపై వంతెన కూలిపోతోందనే వదంతులతో ఈ తొక్కిసలాట జరిగింది. అంతకుముందు దక్షిణాదిలో ప్రసిద్ధిచెందిన కేరళ శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. 2011 జనవరి 14న జరిగిందీ దారుణం. భక్తులపైకి జీపు దూసుకెళ్లటం తొక్కిసలాటకు కారణమైంది. ఈ దుర్ఘటనలో 104మంది మరణించారు. కేరళలోనే ఆ తర్వాత 2016 ఏప్రిల్ 10న జరిగిన మరో విషాదంలో 111మంది ప్రాణాలు కోల్పోయారు. కొల్లంలోని పుట్టింగల్ దేవి ఆలయ ప్రాంగణంలో కాళీమాత గౌరవార్థం బాణసంచాని కాల్చటంతో భక్తులు మంటల్లో చిక్కుకున్నారు.
2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 63 మంది మృతి చెందారు. మృతులంతా మహిళలూ పిల్లలే. బీహార్ రాజధాని పట్నాలో గంగా నది ఒడ్డున 2012 నవంబరు 19న ఛఠ్ పూజ సందర్భంగా తాత్కాలిక వంతెన కూలిపోయి తొక్కిసలాట జరగటంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తర్వాత అదే పాట్నాలోని గాంధీ మైదానంలో 2014 అక్టోబరు 3న జరిగిన తొక్కిసలాటతో దసరా వేడుకలు విషాదంగా ముగిశాయి. ఆ ఘటనలో 32 మంది మరణించారు. 2022 జనవరి 1న జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాట 12 నిండుప్రాణాలను బలితీసుకుంది. 2023 మార్చి 31 న ఇండోర్‌లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా స్లాబ్ కూలిపోవడంతో 36 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి విషాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వేలమంది యాత్రికులొచ్చే పుష్కరాల్లోనూ తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ప్రారంభంరోజునే తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాటతో మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా సీరియస్ యాక్షన్‌కి దిగింది ప్రభుత్వం. పైగా తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం కావటంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. అందుకే ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా కొండపై దర్శనాలు సాఫీగా సాగేలా ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది.
2023లో 6లక్షల 9 వేల మంది భక్తులు తిరుమలలో వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే.. గత ఏడాది 6లక్షల 47వేల452 మంది భక్తులు వైకుంఠ ద్వారం నుంచి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈసారి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంతా అనుకున్నారు. కానీ టికెట్ల దశలోనే ఇంత రద్దీ ఉంటుందని అంచనా వేయలేకపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు ఇంతగా రద్దీ పెరిగింది. పుణ్యక్షేత్రాల్లో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తిరుపతి ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..