ఉత్తమ్ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్‌కు భవితవ్యం: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Raja Gopal Reddy sensational comments on Uttam Kumar Reddy, ఉత్తమ్ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్‌కు భవితవ్యం: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తమ పదవులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌కు భవితవ్యం ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడటానికి కారణం వారిద్దరి వ్యవహార తీరేనని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇక జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేస్తే.. కింది స్థాయిలో ఎవరు మాత్రం ఏమి చేయగలరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీ కూడా పుంజుకుంటోందని మరోసారి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తాను పార్టీ మారినంత మాత్రాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతుల కోసం యాత్ర చేస్తే చేయనీయండని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాగా ఆ మధ్యన ఓ సభలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. మోదీపై, బీజేపీపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. దీనికి తోడు బీజేపీ పార్టీ కీలక నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు జరిపినట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరడాన్ని మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు వ్యతిరేకించడం.. దీంతో ఆయన కాస్త వెనక్కి తగ్గడం జరిగాయని తెలిసింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది. ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా మరోసారి కాంగ్రెస్ నేతలపై ఘాటు కామెంట్లు చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *