
బురద మట్టి, కాలువలలో హాయిగా సేదతీరే పందులను మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు. ఏ ఊర్లో అయినా పందుల జీవన విధానం ఇలాగే ఉంటుంది. అసలు పందులు బురదలోనే ఎందుకు ఉంటాయనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా?

నిజానికి, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మనకు చెమటలు పడతాయి. చెమట పట్టడం ద్వారా, అది మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఆ సమయంలో చెమట గ్రంథులు చెమటను బయటకు పంపుతాయి. కానీ పందుల విషయంలో అలా జరగదు. వాటికి చమట గ్రంధులు లేకపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకోవడానికి ఎల్లప్పుడు బురద మట్టిలో ఉండటానికి ఇష్టపడతాయి. బురద వలన వాటికి చాలా ఉపశమనం కలుగుతుంది. పంది చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో బురద ఉపయోగపడుతుంది.

పందులను చాలా మురికి జంతువులుగా పరిగణిస్తారు. అయితే నిజానికి పందులు చాలా శుభ్రమైన జంతువులు అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అవి పడుకునే ప్రదేశంలో మలవిసర్జన చేయవట. అంతే కాకుండా అవి తమకు నచ్చినప్పుడే ఆహారం తీసుకుంటయట..

పందులకు మనుషులకు ఉన్నంత మేధస్సు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే పందులను ప్రపంచంలోని ఐదవ అత్యంత తెలివైన జంతువులుగా పరిగణించబడుతున్నాయి.

కుక్కల కంటే పందులు ఎక్కువ తెలివైన జీవులు. వీటికి తేలికగా శిక్షణ ఇవ్వొచ్చు. పందులు కేవలం రెండు వారాల్లోనే తమ పేరు నేర్చుకుని ఆ పేరుతో పిలిస్తే ఎక్కడికైనా వస్తాయని అధ్యయనాల్లో తేలింది.