
మన భూమి అంతులేని వింతలకు నిలయం. ఎటు చూసినా పచ్చని అడవులు, అపారమైన సముద్రాలు, ఆకాశాన్ని తాకే పర్వతాలు.. కానీ భూమి ఎక్కడ ముగుస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం వెతికితే మనకు వినిపించే పేరు ఉషువాయా. దీనిని ప్రపంచం మొత్తం ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తుంది. దక్షిణ అమెరికా ఖండం చివరి కొనలో అర్జెంటీనా దేశంలోని టియెర్రా డెల్ ఫ్యూగో ద్వీపసమూహంలో ఈ అద్భుత నగరం కొలువై ఉంది. దీని తర్వాత ఇక మానవ నివాసాలు ఉండవు, కేవలం అంతులేని సముద్రం.. ఆ తర్వాత గడ్డకట్టే అంటార్కిటికా ఖండం మాత్రమే కనిపిస్తాయి. అందుకే దీనిని భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న నగరంగా గుర్తిస్తారు.
మంచు ఖండమైన అంటార్కిటికాకు వెళ్లాలనుకునే సాహసికులకు ఇది ప్రధాన నిలయం. ఇక్కడి నుండి అంటార్కిటికా కేవలం 1,000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికాకు వెళ్లే క్రూయిజ్ షిప్‌లలో 90శాతం ఇక్కడి నుండే బయలుదేరుతాయి. ఒకవైపు బీగిల్ ఛానల్ సముద్ర జలాలు, మరోవైపు మంచుతో నిండిన ఆండీస్ పర్వత శ్రేణులు.. ఈ నగరాన్ని ఒక అందమైన చిత్రపటంలా మారుస్తాయి. సుమారు 83,000 మంది జనాభా ఉన్న ఈ నగరంలో స్పానిష్ ప్రధాన భాష. పర్యాటకం ఇక్కడి ప్రధాన ఆదాయ వనరు కావడంతో ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతుంటారు.
టియెర్రా డెల్ ఫ్యూగో నేషనల్ పార్క్: ఇక్కడి అడవులు, సరస్సులు పర్యాటకులకు స్వర్గధామాలు. ఇక్కడే ప్రపంచపు చివరి రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది.
లెస్ ఎక్లైర్యర్స్ లైట్‌హౌస్: సముద్రం మధ్యలో ఉండే ఈ ఎర్రటి లైట్‌హౌస్ ప్రపంచప్రసిద్ధి చెందింది. దీనిని చూసేందుకు పర్యాటకులు బోటు ప్రయాణాలు చేస్తారు.
బీగిల్ ఛానల్ ప్రయాణం: ఇక్కడ సముద్రపు సింహాలు, పెంగ్విన్‌లు, రకరకాల సముద్ర పక్షులను దగ్గర నుండి చూడవచ్చు.
ఉషువాయా కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభూతి. భూమిపై మానవ ప్రయాణం ముగిసే చోట నిలబడి సూర్యాస్తమయాన్ని చూడటం ఒక మరుపురాని జ్ఞాపకం. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. కాగా మీరు ప్రపంచాన్ని చుట్టి రావాలని కలలు కనే పర్యాటకులైనా లేదా వింతైన ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్నవారైనా ఉషువాయా ఖచ్చితంగా మీ లిస్ట్‌లో ఉండాల్సిన నగరం. భూమికి ఆఖరి అంచున నిలబడి ఆ ప్రకృతి అందాలను చూడటం ఒక వరం.